తెలంగాణలో తొలిసారిగా ట్రాన్స్ ఉత్సవం..
సంక్షేమ బోర్డు ద్వారా ట్రాన్స్ జెండర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
దిశ, ముషీరాబాద్ : సంక్షేమ బోర్డు ద్వారా ట్రాన్స్ జెండర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ట్రాన్స్ ఉత్సవం - 2023 కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్ట మొదటిసారిగా కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. లింగ మార్పిడి కోసం డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, లింగ మార్పిడి ఆపరేషన్లను ఉచితంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో ట్రాన్స్ జెండర్స్ ఇతర రాష్ట్రాలకు వెల్లే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా మనరాష్ట్రంలోనే ఉస్మానియా, గాంధీ ఆస్పత్రిలో ఉచితంగా అవయవ మార్పిడి చేస్తున్నారని అన్నారు.
ట్రాన్స్ జెండర్ల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు, సంక్షేమ బోర్డు ద్వారా మంత్రి హరీష్ రావు కృషి చేస్తున్నారని తెలిపారు. పుట్టుకతోనే అంగవైకల్యం, శారీరక, మానసిక వైకల్యం ఉండటం తప్పేమి కాదని, అటువంటి వారిని గుర్తించి ఉపాధి కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ట్రాన్స్ జెండర్స్ కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలతో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశామన్నారు. ఈ బోర్డు ద్వారా ఎవరికి ఏ రంగంలో నైపుణ్యత ఉందో అందులోనే వారికి శిక్షణ ఇస్తామని తెలిపారు. అందుకోసం రెండు కోట్ల రూపాయలను అందజేశారన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేశామని, దాని ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాల స్థాయిల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో డెస్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం పాడుపడుతుందని, రాష్ట్రంలో 55 వేలకు పైగా ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ, డిసబుల్ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికెరి, డైరెక్టర్ శైలజ, ఛైర్మన్ వాసుదేవరెడ్డి, ట్రాన్స్ జెండర్స్ ప్రతినిధులు చంద్రముఖి, రచన ముద్రబోయిన, వసంత, షబీరా, కిరణ్, లైల, నవదీప్, మీర సంగీతతో పాటు పెద్ద ఎత్తున ట్రాన్స్ జెండర్లు తరలివచ్చారు.