మంత్రి పొన్నం వివరాలు సేకరించిన ఎన్యుమరేటర్లు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

Update: 2024-11-09 14:48 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సర్వేలో భాగంగా శనివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 మినిస్టర్స్ కాలనీలోని మంత్రి నివాసంలో ఎన్యూమరేటర్ ఆయన కుటుంబ వివరాలను సేకరించి స్టిక్కర్ అతికించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్యూమరేటర్లకు తన కుటుంబ వివరాలు వెల్లడించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు అలాగే ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి సామజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అలాగే రాజకీయ అవకాశాలను మెరుగు పరుచుటకు పక్కాప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిగా సహకరించి వివరాలను తెలపాలని సూచించారు. ఎన్యుమారేటర్లు సర్వే చేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ స్నేహ శబరిష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరామ్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, తహశీల్దార్ అనితారెడ్డి, సూపర్వైజర్ శ్రీకాంత్, ఎన్యూమరేటర్స్ తదితరులు పాల్గొన్నారు.


Similar News