ప్రమాదంలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలు..!

తెలంగాణలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీల మనుగ ప్రశ్నార్థకంగా మారింది...

Update: 2025-01-03 02:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తీవ్ర ఒత్తిడి కారణంగా స్టూడెంట్లు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అయినా ప్రైవేట్ యాజమాన్యాల వైపే విద్యార్థుల తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నారు. తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్చుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో స్టాండర్డ్స్ ఉండవనే భావనలో పలువురు పేరెంట్స్ ఉంటున్నారు. అందుకే తమ పిల్లలు మంచి ఉన్నతమైన హోదాలో ఉండాలనే స్వార్థంతో పాటు ప్రెస్టేజీ ఇష్యూ కూడా ప్రైవేట్ యాజమాన్యాల్లో చేరికకు కారణంగా మారుతోంది. ఇది ఎంతలా అంటే తెలంగాణలో అనుమతి ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీల సంఖ్య కంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. ప్రభుత్వ కాలేజీల్లో ఉండే విద్యార్థుల కన్నా ప్రైవేట్ యాజమాన్యాల్లో దాదాపు డబుల్ సంఖ్యలో విద్యార్థులుండటం గమనార్హం.

తెలంగాణలో అనుమతి ఉన్న ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు మొత్తం 1257 ఉన్నాయి. అయితే ఇందులో చదివే విద్యార్థులు మాత్రం 6,23,993 మంది ఉండటం గమనార్హం. అలాగే తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలు మొత్తం 1771 ఉన్నాయి. కానీ వీటిలో చదివేది కేవలం 3,15,809 మంది మాత్రమే. దాదాపు రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్నారనేది దీన్నిబట్టి అర్థమవుతోంది. ప్రైవేట్ కాలేజీల వైపునకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు. అయితే అందరికీ నాణ్యమైన విద్య అందించాల‌నేది నాయ‌కుల మాట‌ల్లోనే తప్ప చేతల్లో మాత్రం క‌నిపించ‌కపోవడం వల్లే ప్రభుత్వ కాలేజీలు మరుగునపడ్డాయని విమర్శలు వస్తున్నాయి. నాణ్యమైన విద్య ఇక్కడే అందుతుందనే భరోసా కల్పిస్తే ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనను మెరుగుపరిచి అందరినీ ప్రభుత్వ కాలేజీల్లో చేరేలా ప్రోత్సహించాలని, లేదంటే ప్రభుత్వ కాలేజీల మనుగడ దెబ్బతినే ప్రమాదముంది.

నాణ్యమైన విద్య అందిస్తామనే భరోసా కల్పించడంలో విఫలం-రాజేంద్ర ప‌ల్నాటి, యూత్ ఫ‌ర్ యాంటీ కరప్షన్ ఫౌండర్

తెలంగాణ ప్రభుత్వం ఇంట‌ర్ విద్య కోసం ప్రతి ఏడాది కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుపెడుతోంది. కానీ విద్యార్థుల‌కు ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందిస్తామనే భరోసా కల్పించడంలో మాత్రం ఫెయిలవుతోంది. దీనివల్లే ఎవరూ చేరేందుకు ఆసక్తిచూపడంలేదు. కోట్లాది రూపాయ‌ల‌తో అత్యాధునిక కాలేజీ భ‌వ‌నాలు, ల‌క్షల్లో జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఇంట‌ర్ కాలేజీల్లో లెక్చరర్లు ఉన్నా విద్యార్థులు ఎందుకు త‌క్కువ‌గా ఉంటున్నార‌నే విష‌యంపై ప్రభుత్వం పర్యవేక్షించాలి.


Similar News