టీజీ న్యాబ్ 7 డేస్ స్పెషల్ డ్రైవ్ షురూ...
రాష్ట్ర యువత కొత్త సంవత్సరం స్వాగత వేడుకల్లో డ్రగ్స్, మత్తు బారిన పడకుండా టీజీ న్యాబ్ పోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులు పక్కా ప్రణాళికలను రూపొందించారన్నారు టీజీ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య.
దిశ, సిటీ క్రైమ్ : రాష్ట్ర యువత కొత్త సంవత్సరం స్వాగత వేడుకల్లో డ్రగ్స్, మత్తు బారిన పడకుండా టీజీ న్యాబ్ పోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులు పక్కా ప్రణాళికలను రూపొందించారన్నారు టీజీ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో టీంలు ఇతర రాష్ట్రాల్లో మకాంవేసి డ్రగ్స్ మాఫియా రాష్ట్రం వైపు, హైదరాబాద్ వైపు కన్నెత్తకుండా చేస్తున్నారన్నారు. గోవా, ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, రాజస్థాన్, ఇంకా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో మఫ్టీలో డ్రగ్స్, గంజాయి దందా చేసే మాఫియా హాట్ స్పాట్ లలో ప్రత్యేక టీంలు తిష్ట వేశారని తెలిపారు. అక్కడ పగలు, రాత్రుళ్లు నిఘా పెడుతూ మన రాష్ట్రం వైపు వాటిని రాకుండా అడ్డుకునేందుకు కృషి చేస్తున్నారన్నారు.
అదే విధంగా టీజీ న్యాబ్, టీం రాడార్ లో ఉన్న వారి కదలికలు ఇతర రాష్ట్రాల్లో హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకుంటూ వాచ్ పెట్టారన్నారు. సాంకేతికంగా ఎప్పటికప్పుడు డ్రగ్స్ మాఫియా నెట్ వర్క్ ను జల్లెడ పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల దందా చేసే వారితో పాటు, సరఫరా చేస్తూ పట్టుబడ్డ వారు, సేవిస్తున్న వారు మొత్తం 30 వేల వరకు ఉంటుందంటున్నారు. వీరందర్నీ టీజీ న్యాబ్, రాష్ట్ర పోలీసులు నిరంతరం ఫాలో అవుతున్నారని తెలిపారు. అదే విధంగా డార్క్ వెబ్ లో కూడా సాంకేతికంగా టీజీ న్యాబ్ టీం సైబర్ పెట్రోలింగ్ చేస్తు డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసేందుకు బిగ్ స్కెచ్ వేశారన్నారు.
2 వేల కిట్లతో రంగంలో టీజీ న్యాబ్ టీంలు..
మరో వైపు టీజీ న్యాబ్ కొత్త సంవత్సరం స్వాగతపు వేడుకలను దృష్టిలో పెట్టుకుని 7 రోజులు డ్రైవ్ కు సిద్ధమైందన్నారు. దీని కోసం దాదాపు 1200 డ్రగ్స్ యూరిన్ కిట్లు, 800 సలైవా డ్రగ్స్ టెస్ట్ కిట్లు, 20 డాగ్ స్క్వాడ్ టీం తో బుధవారం నుంచి డిసెంబర్ 31 వేడుకలు ముగిసే వరకు నిరంతరం తనిఖీలు చేపట్టనున్నట్లు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి పబ్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఫాంహౌస్, రిసార్టులతో పాటు ప్రైవేట్ హోటల్ రూమ్స్, గెస్ట్ హౌజ్ లలో సోదాలు జరుపనున్నారన్నారు. అదే విధంగా రోడ్ల పై ఈ కిట్స్ లతో అకస్మిక తనిఖీలను చేస్తామన్నారు. ఈ పరీక్షల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే చట్టపరంగా కఠినంగా చర్యలు ఉంటాయని సందీప్ శాండిల్య హెచ్చరించారు. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదన్నారు. అదే విధంగా 21 సంవత్సరాలలోపు ఎవరికైనా మద్యం విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. పౌరులు కూడా వారికి డ్రగ్స్ వ్యవహారాల పై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని సందీప్ శాండిల్య కోరారు. తల్లిదండ్రులు కూడా ఈ 7 రోజులలో వారి పిల్లల నైట్ పార్టీల పై ప్రత్యేక నజర్ పెట్టాలని సూచించారు.