హామీలు నెరవేర్చకపోతే గల్లా పట్టుకుని అడిగే హక్కు నిరుద్యోగులకు ఉంది.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గల్లా పట్టుకుని అడిగే హక్కు నిరుద్యోగులకు ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.
దిశ, సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే గల్లా పట్టుకుని అడిగే హక్కు నిరుద్యోగులకు ఉందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. గడిచిన పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిరుద్యోగులను పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద బుధవారం విద్యార్థి, నిరుద్యోగ కృతజ్ఞతా సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధులుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, తెలంగాణ ఉమెన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శోభారాణి, గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ లు హాజరై మాట్లాడారు.
తెలంగాణ అనేది ఎవరి సొత్తు కాదని, ఇది ప్రజల సొత్తని తెలిపారు. మేమే తెలంగాణ తెచ్చినం, మేమె వారసులం అని కొందరు చెప్తున్నారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలకోసం యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఉద్యమం పేరుతో డబ్బు మూటలు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల, రైతుల, కార్మికుల పక్షాన ఉంటదని అన్నారు. కేసీఆర్ పాలన పోయి ఇప్పుడు ప్రజా పాలన వచ్చిందని, ప్రజా పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు గత బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా వ్యవహరించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుందన్నారు.
కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల పక్షాన ఉన్నదని విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రక్రియ వచ్చే నెల నుండి ప్రారంభం అవుతుందని, కాంగ్రెస్ హయాంలో ఇంకా కొలువులు త్వరలో వస్తాయని, నిరుద్యోగులు అధైర్య పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సరిత, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతా రాయ్, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట స్వామి, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, ఏపూరి సోమన్న, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ మెడరపు సుధాకర్, బైరు నాగరాజు గౌడ్, రెడ్డి శ్రీను, బోనాల నగేష్, నాగరాజు, భీమ్ రావ్ నాయక్, మణికంఠ నాయుడు, హేమంత్ చౌదరి, చక్రాల రఘు, గిరిజన శక్తి నాయకులు శరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.