ఏసు క్రీస్తు జీవితం ఇతరుల పట్ల ప్రేమను పెంచుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ఏసు క్రీస్తు జీవితం ఇతరుల కోసం ప్రేమను పెంచుడనేలా ఎంతో ప్రేరేపిస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
దిశ, బేగంపేట : ఏసు క్రీస్తు జీవితం ఇతరుల కోసం ప్రేమను పెంచుడనేలా ఎంతో ప్రేరేపిస్తుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కమిటీ, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ సంయుక్త ఆధ్వర్యంలో 46వ గ్రేటర్ హైదరాబాద్ క్రిస్మస్ ఉత్సవాలు సికింద్రాబాద్ పీజీ కళాశాల ఆవరణలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఏసు క్రీస్తు నాడు అందించిన సందేశం అందరిని ఏకం చేస్తుందన్నారు. తాను వచ్చిన త్రిపుర రాష్ట్రంలో కులం, మతం లేకుండా అందరూ క్రిస్మస్ ను జరుపుకోవడం తాను అక్కడ చూశానని అన్నారు. కార్డినల్ పూల ఆంథోనీ మాట్లాడుతూ ప్రపంచ మానవాళిని రక్షించడానికి ఏసు క్రీస్తు మానవుడి రూపంలో ఈ లోకానికి వచ్చాడని అన్నారు.
శాంతికి ప్రతి రూపం ఏసు క్రీస్తు అని, ప్రపంచం మొత్తం శాంతి నెలకొనాలని ఆయన అన్నారు. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ప్రధాన కార్యదర్శి పాస్టర్ టీ భాస్కర్ మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం అనేది శాంతికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూసీసీ కమిటీ చైర్ పర్సన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి జీడీ అరుణ, ప్రధాన కార్యదర్శి స్టీవా గెలెలీ, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ , సీఎస్ఐ డిప్యూటీ మాడరేటర్ రూబెన్ మార్క్, బిషప్ ఎంఏ డేనియల్, పాస్టర్ పురుషోత్తం తదితర ప్రముఖులతో పాటు అన్ని సంఘాలకు చెందిన బిషప్లు, పాస్టర్లు పాల్గొన్నారు. తెలుగు, ఇంగ్లీష్ టాబెర్నాకిల్స్ క్వయర్ మధురమైన పాటలను ఆలపించారు. బైబిల్ క్విజ్లతో పాటు క్రీస్తు జననంకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.