‘చెత్త’ సేవలు మాకొద్దు.. వేరే శాఖలకు వెళ్తున్న డీఈలు

హైదరాబాద్ మహానగరంలో పారిశుద్ధ్య నిర్వహణ జీహెచ్ఎంసీకి

Update: 2024-11-08 02:04 GMT

దిశ, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరంలో పారిశుద్ధ్య నిర్వహణ జీహెచ్ఎంసీకి సవాల్‌గా మారింది. పారిశుధ్య కార్మికుల నుంచి జోనల్ కమిషనర్ వరకు సక్రమంగా పనులు చేస్తేనే నగరమంతా పరిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఫీల్డ్ లెవల్ ఆఫీసర్ల పాత్ర కీలకం. దీంతోపాటు ఇంటింటికి చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడంలేదనే విమర్శలు లేకపోలేదు. దీంతో పాటు నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే కార్మికుల హాజరు తీసుకోవడానికే మాత్రం పరిమితమవుతున్నారని, మనస్పూర్తిగా పనిచేయడం లేదని బల్దియా ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఒక పక్క చెత్త నిర్వహణలో కీలకంగా డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఈ విధుల పట్ల అసంతృప్తి గా ఉన్నారు. మాకొద్దీ సేవలని ఇతర విభాగాలకు వెళ్లిపోతున్నారు. మరోపక్క ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన మెడికల్ ఆఫీసర్లు మాత్రం ‘మాకివ్వండి ఈ సేవలు చేస్తాం’ అంటూ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కి చక్కర్లు కొడుతున్నారు.

8 వేల మెట్రిక్ టన్నులు..

జీహెచ్ఎంసీ పరిధిలో 625 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. సుమారు 30 లక్షల ఇండ్లు, కోటిన్నర జనాభా ఉందని అధికారుల అంచనా. రోజుకు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంటింటి చెత్తను సేకరించడానికి 4,500 ఆటో టిప్పర్లు పనిచేస్తున్నాయి. ఈ టిప్పర్ యజమానులకు జీహెచ్ఎంసీ ఎలాంటి వేతనం ఇవ్వడం లేదని ప్రతి ఇంటి నుంచి ఎంతో కొంత వసూలు చేసుకోవాలని జీహెచ్ఎంసీ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో మినిమం రూ.100, ఏరియాను బట్టి ఎక్కువ కూడా వసూలు చేస్తున్నారు.

చెత్త నిర్వహణ కోసమే ప్రమోషన్..

జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త నిర్వహణలో పర్యావరణ ఇంజినీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్లు(ఏఈ)గా ఉన్న 30 మందికి అప్పటి కమిషనర్ జనార్దన్ రెడ్డి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(డీఈ) ప్రమోషన్ ఇచ్చి ఒక్కో సర్కిల్‌కు ఒక్కో డీఈని కేటాయించారు. ఏఈ నుంచి డీఈగా ప్రమోషన్ రావాలంటే కనీసం పదేండ్ల సమయం పడుతుందని, పారిశుధ్య నిర్వహణ కోసం అనతికాలంలోనే ప్రమోషన్ రావడం గొప్ప విషయమని, ఆ అవకాశాన్ని డీఈలు వినియోగించుకోకుండా వేరే విభాగాలకు వెళ్లిపోతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 మంది డీఈలకుగాను ప్రస్తుతం 8 మంది మాత్రం పనిచేస్తున్నారు. వీరిలో సికింద్రాబాద్ డీఈ వెంకటేష్ మాత్రమే బాగా పనిచేస్తున్నారని ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.

క్యూ కడుతున్న మెడికల్ ఆఫీసర్లు..

ప్రజల ఆరోగ్యం, ఆస్ప్రతుల్లో పనిచేయాల్సిన అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు(ఏఎంఓహెచ్) మాత్రం చెత్త పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు పోస్టింగ్ ఇవ్వాలని 12 మంది జీహెచ్ఎంసీ చుట్టూ తిరుగుతున్నారు. అయితే 30 సర్కిళ్లలో 22 సర్కిళ్లలో ఏఎంఓహెచ్‌లే పారిశుధ్య నిర్వహణ పనులు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ జోన్‌లో ఓ మెడికల్ ఆఫీసర్ ఏండ్ల తరబడి అక్కడే పనిచేస్తున్నారు. ఆ అధికారులపై ఏసీబీ అధికారుల నిఘా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా హెల్త్ విభాగంలో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్లు పారిశుధ్యం విభాగంపై పెత్తనం చెలాయిస్తున్నారని, అందుకు డీఈ ఎక్కువ కాలం ఉండడంలేదనే ఆరోపణలు లేకపోలేదు.


Similar News