జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం.. 9 అంశాలకు ఆమోదం

జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులలో క్రీడా కార్యక్రమాల నిర్వహణకు ప్రతి కార్పొరేటర్ డివిజన్‌కు రూ.2 లక్షల విలువైన ఆటలు/క్రీడల మెటీరియల్ అందించడానికి స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.

Update: 2024-11-28 03:02 GMT

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులలో క్రీడా కార్యక్రమాల నిర్వహణకు ప్రతి కార్పొరేటర్ డివిజన్‌కు రూ.2 లక్షల విలువైన ఆటలు/క్రీడల మెటీరియల్ అందించడానికి స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం 6వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. సమావేశంలో 9 అంశాలు, ఒక టేబుల్ ఐటమ్‌కు ఆమోదం తెలిపినట్లు మేయర్ తెలిపారు.

కమిటీలో ఆమోదించిన అంశాలు..

- ఎస్ఎన్డీపీ కింద నాగమయ్య కుంట నాలా రీమోడలింగ్ రూ.19.34 కోట్లతో పూర్తయినందున మిగులు నిధులతో నాలా పొడిగింపునకు ప్రతిపాదించిన బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.3 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టడానికి ఆమోదం.

- హబీబ్ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట మెయిన్ రోడ్, రియాసత్ నగర్ నుంచి హబీబ్ నగర్ వయా పాపాలాల్ టెంపుల్ వరకు రహదారి అభివృద్ధికి 174 ఆస్తుల సేకరణకు ఆమోదం.

- ఖైరతాబాద్ జోన్ మెహిదీపట్నం సర్కిల్ మల్లేపల్లి మోడల్ మార్కెట్ బిల్డింగ్ సమీప స్లమ్ ఏరియా నిరుద్యోగ యువత, వెనుకబడిన మహిళలకు సీఎస్ఆర్ కింద లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిధులతో సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లవ్లీ హుడ్ ప్రోగ్రాం ద్వారా శిక్షణలు నిర్వహించడానికి అవకాశమివ్వాలని నిర్ణయించింది. ఏడాది కాలం పాటు మల్లేపల్లి మోడల్ మార్కెట్ బిల్డింగ్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు అనుమతిస్తూ సంబంధిత ఏజెన్సీతో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎంఓయూ చేసుకోవడానికి ఆమోదం.

- ఎఫ్సీఐ గోదాం రోడ్ నుంచి చర్లపల్లి రైల్వే సరిహద్దు వయా ఐఓసీఎల్ నుంచి గ్రోసెన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వరకు ప్రతిపాదించిన 24 మీటర్ల నుంచి 30 మీటర్ల వరకు పెంచడానికి రివైజ్డ్ ఆర్డీపీలో 6 ఆస్తుల సేకరణకు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి ఆమోదం.

- ఆగస్టు 2024 జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలకు కమిటీ ఆమోదం.

- ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన జీహెచ్ఎంసీ మేయర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ (బీ.నాగరాజు) సేవలు పొడగించుటకు, సికింద్రాబాద్ జోన్‌లో అదనపు పోస్ట్ మంజూరుకు జీహెచ్ఎంసీ అనుమతి/రాటిఫికేషన్‌కు కమిటీ ఆమోదం.

- పోలీస్ శాఖకు చెందిన నాంపల్లి వార్డు 45లోని పోలీస్ క్వార్టర్స్, గోషామహల్ బంక్, స్టేడియం, బాస్కెట్ బాల్, బాడ్మింటన్ కోర్ట్ లకు సంబంధించిన 31.39 ఎకరాల భూమిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణానికిగాను ఎన్‌ఓసీ జారీ చేయుటకు జీహెచ్ఎంసీ సిఫార్సు చేస్తూ కమిటీ ఆమోదం.

- సెప్టెంబర్ 2024 మాసం జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలకు కమిటీ ఆమోదం.


Similar News