సక్సెస్ ఫుల్ మోడ్.. ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్ మెట్రో

పబ్లిక్ ప్రయివేటు పార్టనర్ షిప్(పీపీపీ) విధానంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) విజయవంతంగా నేటితో 7 ఏండ్లు పూర్తి చేసుకుంది.

Update: 2024-11-28 02:55 GMT

దిశ, సిటీబ్యూరో : పబ్లిక్ ప్రయివేటు పార్టనర్ షిప్(పీపీపీ) విధానంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) విజయవంతంగా నేటితో 7 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ విధానంలో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులు సక్సెస్ కాలేదు. బ్యాంకాక్‌లో 35కి.మీ పీపీపీ మోడల్ మెట్రో ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం టేకోవర్ చేసుకుంది. ఢిల్లీలో ఎయిర్‌పోర్ట్ మెట్రోరైలు 20కి.మీను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ముంబైలో 11 కి.మీ మెట్రోదీ ఇదే పరిస్థితి.

తెలంగాణకు మణిహారం..

తెలంగాణకు మణిహారంగా నిలిచిన ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైల్ పట్టాలెక్కి ఈ నెల 28వ తేదీకి సరిగ్గా ఏడు సంవత్సరాలు పూర్తవుతుంది. హైదరాబాద్ మెట్రో రైలుపై స్టాన్ ఫార్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ 415 కి.మీలతో మొదటి స్థానంలో ఉందని, 74 కి.మీలతో బెంగళూరు రెండో స్థానం, 69 కి.మీలతో హైదరాబాద్ మెట్రో రైలు మూడో స్థానంలో ఉంది. మెట్రో రైల్ మొదటి దశ మొత్తం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర 57 స్టేషన్లతో నిర్మించబడింది. మియాపూర్ - ఎల్‌బీ నగర్ 29 కి.మీ కారిడార్‌లో 27 స్టేషన్లు, జేబీఎస్-ఎంజీబీఎస్ 11 కి.మీ కారిడార్‌లో 8 స్టేషన్లు, నాగోల్ - రాయదుర్గ్ 29 కి.మీకారిడార్‌లో 22 స్టేషన్లు ఉన్నాయి.

రూ.22,148కోట్ల పెట్టుబడితో..

మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టును రూ.22,148 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేశారు. వీటిలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా రూ.2,970 కోట్లు, భారత ప్రభుత్వం ద్వారా రూ.1,204 కోట్లు, 81 శాతం నిధులు రూ.17,974 కోట్లు ప్రైవేట్‌రంగ రాయితీ సంస్థ ఎల్‌అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ పెట్టుబడి పెట్టింది.

63.4 కోట్ల మంది ప్రయాణం..

అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మెట్రోలో రోజూ దాదాపు 5 లక్షల మంది (సుమారు 6.60 లక్షల పాసింజర్ ట్రిప్స్) ఈ మొదటి దశ మార్గాలను వినియోగించుకుంటున్నారు. ఏడేండ్ల కాలంలో 63.4 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. రికార్డు స్థాయిలో ఆగస్టు 14, 2024న 5.63 లక్షల మంది (7.43 మంది పాసింజర్ ట్రిప్స్) ప్రయాణించారు.

అమీర్‌పేట్ స్టేషన్‌లో సంబురాలు..

పీపీపీ విధానంలో ఏడేండ్ల పాటు విజయవంతంగా నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) గురువారం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో సంబురాలను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి, ఎల్అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీ.రెడ్డి పాల్గొనున్నారు. అయితే ఏడేండ్లు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి అన్నారు. ప్రజల సహకారంతో సాధ్యమైందన్నారు.


Similar News