మలక్ పేట ఘటనపై అనుమానాలు ఉన్నాయి: Governor Tamilisai
మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతిచెందిన ఘటన బాధకరం అని...Special News
దిశ, డైనమిక్ బ్యూరో: మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతిచెందిన ఘటన బాధకరం అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ గైనకాలజిస్ట్ గా ఈ ఘటనపై తనకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఘటన నేపథ్యంలో ఆ ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నప్పటికీ పండుగ కారణంగా ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆదివారం రాజ్ భవన్ లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పొంగలి అన్నం వండారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మలక్ పేట ఘటనపై రియాక్ట్ అయ్యారు. 'గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సమయంలోనూ నలుగురు మరణించారు. తెలంగాణలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగుపరచాలి. వైద్యరంగంలో వసతులు మెరుగవ్వడం లేదని చెప్పడం లేదు. కానీ ఇంకా మెరుగు పరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి' అని అన్నారు.
ప్రభుత్వ బిల్లుల పెండింగ్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పందించిన గవర్నర్ బిల్లులు పెండింగ్ లో కాదు తన పరిశీలనలో ఉన్నాయని స్పష్టం చేశారు. వర్సిటీ నియామకాల బిల్లులో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, యూనివర్సిటీ నియామకాల బిల్లు.. వివాదాలతో ఆలస్యం కారాదన్నదే తన భావన అని చెప్పారు. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని, యూజీసీ కొన్ని అంశాలను ప్రస్తావించిందని, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలన్నారు. యునివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కావాలన్నారు. తెలంగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలును ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్.. ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.