నాడు కూతురు-నేడు భార్య..ఆ కుటుంబంలో పెను విషాదం నింపిన ప్రమాదం

Update: 2022-01-16 14:31 GMT

దిశ, ప్రతినిధి , హైదరాబాద్: రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది. డిసెంబర్ 29వ తేదీన నగరంలో ట్యాంక్ బండ్ పై జరిగిన యాక్సిడెంట్ లో మూడేళ్ల కూతురు దుర్మరణం పాలవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం భార్య కూడా చనిపోవడంతో భర్త ఒంటరి వాడయ్యాడు . కరీంనగర్‌కు చెందిన శివకుమార్ (33)కు బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన సమత (30) తో పదమూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల సిరి కూతురు ఉంది. పదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన వారు రాయదుర్గంలో నివాసముంటున్నారు. శివకుమార్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తుండగా భార్య సాఫ్‌వెర్ ఉద్యోగి. కాగా 20 రోజుల క్రితం బెల్లంపల్లి కి వెళ్లేందుకు వారు క్యాబ్ బుక్ చేసుకున్నారు.

తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో సికింద్రాబాద్ వైపు వస్తున్న వారి కారును ఎదురుగా వేగంగా వస్తున్న ప్రవేట్ బస్సు ట్యాంక్ బండ్ పై ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. శివకుమార్, సమతలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న చిన్నారి సిరి తో పాటు క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు 108 వాహనం ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచింది. ఇదిలా ఉండగా మెరుగైన వైద్యం కోసం సమత, శివకుమార్ లను కుటుంబ సభ్యులు యశోదా హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం సమత మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది.

సాయం చేయమని కేటీఆర్‌కు ట్విట్లర్‌లో విజ్ఞప్తి..

ప్రమాదం జరిగిన నాటి నుంచి యశోదా హాస్పిటల్ లో శివ కుమార్, సమతల కు వైద్య చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ లో చేరిన నాటి నుండి శివకుమార్ వైద్యానికి రూ 7.70 లక్షల బిల్లు అయ్యింది. అంత మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంతో సమత సోదరి అనిత మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ వేధికంగా తమ సోదరి కుటుంబానికి వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.



Tags:    

Similar News