చదువొక్కటే కాదు.. ఆటలు కూడా ముఖ్యమేః కలెక్టర్ అనుదీప్

Update: 2024-08-24 11:06 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరోః విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొని రావాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సికింద్రాబాద్ తిరుమలగిరి మండలం బోయిన్ పల్లి బాపూజీనగర్ ప్రభుత్వ గిరిజన గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ వసతి గృహాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని స్టోర్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్, పిల్లల విశ్రాంతి గదులను హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ స్టాక్ నిల్వలను పరిశీలించారు. వంటగదిని తనిఖీ చేసి పిల్లలకు సన్న బియ్యంతో పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు 5వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో ఇంగ్లీష్, తెలుగు పాఠ్య పుస్తకాలు చదివించారు. అనంతరం విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చదువు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దానికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందన్నారు. విద్యార్థులు బాగా చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ఆల్ రౌండ్ ఛాంపియన్ గా రాణించి రాష్ట్రానికి గర్వకారణం కావాలన్నారు. విద్యార్థులు తమకు అర్థమయ్యేంతవరకు టీచర్ ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్.కోటాజి, సికింద్రాబాద్ ఆర్డీవో దశరథ్ సింగ్,వసతి సంక్షేమ అధికారి ఎం నీలిమ, తహసిల్దార్ ఎస్ అశోక్ కుమార్, హెడ్ మాస్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News