ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ కుమార్

ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్సలర్‌ గా

Update: 2024-10-18 15:15 GMT

దిశ,సికింద్రాబాద్ : ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్సలర్‌ గా సీనియర్ ప్రొఫెసర్ మొలుగరం కుమార్ నియమితులయ్యారు. ప్రొఫెసర్ కుమార్ ప్రస్తుతం రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌ డైరెక్టర్‌ గా కొనసాగుతున్నారు.సివిల్ ఇంజినీరింగ్ రంగంలో అపార అనుభవం కలిగిన ఆయన బోధన, పరిశోధనాంశాల్లో 29 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ జేఎన్‌టీయూ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాల యంలో ఇంజినీరింగ్ కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. అక్కడ బోధన, పరిశోధన విభాగాల్లో తనదైన చెరగని ముద్ర వేశారు. ప్రొఫెసర్ కుమార్ రాసిన 100కు పైగా పరిశోధన పత్రాలు అంతర్జాతీయ, జాతీయ జర్నల్స్‌, కాన్ఫరెన్స్‌ల్లో ప్రచురితం అయ్యాయి.

90 మందికి పైగా ఎంటెక్‌, 10కి పైగా పీహెచ్‌డీ విద్యార్థుల డిసర్టేషన్‌, థీసిస్‌లకు పర్యవేక్షణ వహించారు. ఆయన అసాధారణ సేవలకు గాను అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ అధ్యాపకుడిగా పురస్కారం తీసుకున్నారు. ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్‌గాను, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇంజినీర్, తెలంగాణ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. 2019లో స్మార్ట్‌ ఇన్‌ఫ్రా ట్రస్ట్ నుంచి మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఉత్తమ అధ్యాపకుడిగా పురస్కారం లభించింది. 2010 నుంచి 2014 మధ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆయన అనేక పరిశోధన పత్రాలు విశేష గుర్తింపు పొందాయి. దీనితో పాటు అనేక పాలనా పరమైన బాధ్యతల్లో కూడా పాలు పంచుకున్నారు. 2019, 2020 టీఎస్ - పీజీసెట్‌కు కన్వీనర్‌, ఓయు అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఓయూ డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ విభాగం సంచాలకుడిగా, ఓయూ ఎగ్జామ్స్ సెల్‌, డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫ్రాస్టక్చర్ అధిపతిగా, ఓయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా, ఓయు వైస్‌ ప్రిన్సిపాల్‌గానూ పనిచేశారు. ఎఫ్‌ఆఈ, ఐఆర్‌సీ, ఐయూటీ, సీటీఆర్‌జీ, ఐఐబీఈ, డబ్ల్యూసీటీఆర్‌, టీఆర్‌జీ వంటి పలు పరిశోధనా సంస్థల్లో జీవితాకాల సభ్యుడిగా ఉన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేన్స్‌గా రెండేళ్ల పాటు పని చేశారు. ఆ సమయంలో పరీక్షల విభాగంలో అనేక డిజిటల్ సంస్కరణలు ప్రవేశ పెట్టారు. అక్కడి వ్యవస్థలు విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు తగిన స్థాయిలో మొత్తాన్ని ఆధునీకరించారు. దేశంలోనే పేరెన్నికగన్న ఉస్మానియం విశ్వవిద్యాలం ప్రిన్సిపాల్‌గా 2018-21 మధ్య సాంకేతికంగా సంస్కరణల్లో ముందు వరసలో నిలిపారు. కళాశాల ప్రక్రియలు మొత్తం ఆటోమేషన్‌లోకి మర్చి యూజీ, పీజీ కోర్సులకు తిరిగి ఎన్‌బీఏ గుర్తింపు తీసుకుని రావడంలో అమూల్యమైన కృషి చేశారు. ఇన్ని సేవలకు గుర్తుగానే తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సావాల నిర్వాహక కమిటీ లో సభ్యుడిగా నియమించింది. ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఎం.ఈ. ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశ పెట్టడంలో ఆయన కీలకమైన పాత్రపోషించారు. ఆయన పరిశోధనా కార్యక్రమాలకు యూజీసీ, ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం, ఎస్‌ఈఆర్‌బీ, డీఎస్‌టీ నుంచి అనేక విధాల ఆర్ధికసాయం అందించాయి.

ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో 20నగరాల్లో పర్యటించి పరిశోధన పత్రాలు సమర్పించారు ప్రొ.కుమార్. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై లెక్కలేనన్ని కీలక ఉపన్యాసాలు ఇచ్చారు. చర్చ కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. అనేక సాంకేతిక, పరిశోధన సంస్థల్లో ప్రొ. కుమార్ క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ వారు నిర్వహించిన లీప్, మోనాష్ విశ్వవిద్యాలయం, హెచ్‌సీయూ, వివిధ ఐఐఎంలు, ఐఎస్‌బీ నిర్వహించిన పలు నాయకత్వ శిక్షణ కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకున్నారు. ఆయన 2022 -24 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఫాకల్టీ డీన్‌గా అత్యు న్నత స్థానంలో పనిచేశారు. ఆ సమయంలో ఎంతో విలువైన సేవలు అందించారు.


Similar News