పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు

ఆచార్య వెలుదండ నిత్యానందరావు పొట్టి శ్రీరాములు తెలుగు

Update: 2024-10-18 15:23 GMT

దిశ, రవీంద్రభారతి : ఆచార్య వెలుదండ నిత్యానందరావు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. వీరు నాగర్ కర్నూలు జిల్లా మంగనూరు గ్రామంలో 9-8-1962 న విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటలక్ష్మమ్మ, రామేశ్వరరావులు. వీరి కుటుంబమంతా తెలుగు పండితులే కావడం విశేషం. ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం స్వగ్రామంలో జరిగింది. పాలెం ఓరియంటల్ కాలేజిలో ప్రముఖ పండితులు కపిలవాయి లింగమూర్తి, శ్రీరంగాచార్య లాంటి వారి సాంగత్యంలో డిగ్రీ పూర్తి చేసుకోవడమే కాక రచయితగా రాటుతేలారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (తెలుగు 1985) ప్రథమశ్రేణిలో ప్రథమ స్థానం పొందినందుకు గాను గురజాడ అప్పారావు స్వర్ణ పతక పురస్కారం పొందారు. ఆపైన ఎంఫిల్ 1988లో, పీహెచ్డీ 1990లో పూర్తి చేసుకున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే మొదట పార్ట్ టైం అధ్యాపకులుగా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత 24 -7 -1992న ఉస్మానియా తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. అందరికన్నా ఏడేళ్ళు చిన్నవాడిగా 18 మంది సీనియర్ కింద తలలో నాలుకగా పనిచేశారు.

వివాదరహితుడిగా, సౌమ్యుడిగా, నిత్య పరిశోధకునిగా, రచయితగా పేరు తెచ్చుకొని పాత తరానికి కొత్త తరానికి వంతెనగా అంచెలంచెలుగా ఎదిగి ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులుగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గా, హాస్టల్ వార్డెన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆచార్య వెలుదండ నిత్యానందరావు రచయితగా, విద్యావేత్తగా, పరిశోధకునిగా పేరు తెచ్చుకొన్నారు. వీరు రాసిన ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ అనే గ్రంథం అన్ని విశ్వవిద్యాలయ తెలుగు శాఖల్లో పరిశోధకులకు, పర్యవేక్షకులకు కరదీపికగా ప్రామాణిక గ్రంథం గా ఉపయోగపడుతుంది. వందేమాతర గీతం రాసిన బంకించంద్ర చటర్జీ జీవితం-రచనలను విశ్లేషిస్తూ ‘భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర’ (2006)పేరుతో రాసిన గ్రంథం తెలుగులో నేటికీ ఏకైక ప్రామాణిక గ్రంథం. 2022 లో 60 వ ఏట రిటైర్మెంట్ సందర్భంగా 4వేల పుటల్లో 7 సంపుటాల్లో “వెలుదండ నిత్యానందరావు సమగ్ర సాహిత్యం” ఒక్క చేతి మీదుగా వెలువరించడం సాహసోపేత మనీ, సాహిత్యానురక్తికి నిదర్శనమని సాటి రచయితల చేత ప్రశంసలు పొందారు.


Similar News