ఇసుక అక్రమ రవాణాతో పోలీసులకు లింక్‌లు.. నిఘా వర్గాల నివేదికతో యాక్షన్

అక్రమ ఇసుక రవాణా విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా

Update: 2024-10-03 15:29 GMT

దిశ, సిటీ క్రైమ్ : అక్రమ ఇసుక రవాణా విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ దందా వ్యవహారంపై నిఘా వర్గాలతో రహస్య విచారణ చేపట్టి అధికారుల ఇచ్చిన నివేదిక తో ఇసుక మాఫియాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లింక్ లు ఉన్న అధికారుల పై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. మల్టీ జోన్ -2 లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టకుండా ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుసుకుని గురువారం మల్టీ జోన్ -2 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సత్యనారాయణ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ జోన్ పరిధిలోని 9 జిల్లాలకు చెందిన 3 గురు ఇన్స్ పెక్టర్ లు, 13 మంది సబ్ ఇన్స్ పెక్టర్ లను ఐజీ ఆఫీసుకు వీఆర్ లో అటాచ్ చేశారు. ఈ 16 మంది అధికారుల పాత్ర పై ఆధారాలు ఉండటంతో వారి పై శాఖ పరమైన విచారణ కూడా ఉంటుందని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

అక్రమ ఇసుక మాఫియాను అరికట్టడంలో ఫెయిల్ అయిన పోలీసులు వీరే..

సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ ఇన్స్ పెక్టర్లు, వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పునూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల, తుంగతుర్తి, ఆత్మరూర్(ఎస్) , పెన్ పహాడ్, వాడపల్లి, హాలియా పోలీసు స్టేషన్ లకు చెందిన సబ్ ఇన్స్ పెక్టర్ లు ఉన్నారు. ఇదే విధంగా అక్రమ ఇసుక మాఫియాకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అడవిపల్లి, వేములపల్లి, నార్కట్ పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరాస్ పేట్, తాండూర్, చిన్నంబావి ఎస్సైల పై బదిలీ వేటు వేశారు. కొండమల్లేపల్లి హోంగార్డు(947), జడ్చర్ల హెడ్ కానిస్టేబుల్ ఆనంద్(1049) లను జిల్లా ఏఆర్ కు అటాచ్ చేసినట్లు సత్యనారాయణ ప్రకటనలో పేర్కొన్నారు.

మైనర్ రేప్ కేసులో నిర్లక్ష్యం...ఇన్స్పెక్టర్ సస్పెండ్

వికారాబాద్ టౌన్ పీఎస్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న ఏ.నాగరాజు జోగిపేట్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఓ మైనర్ రేప్ కేసులో దర్యాప్తును నిర్లక్ష్యం చేశారు. అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేసినట్లు ఐజీ వి. సత్యనారాయణ తెలిపారు.

డీజీపీ జితేందర్ సీరియస్..

అక్రమ ఇసుక దందాతో ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయానికి అక్రమార్కులు వారి వ్యాపారంతో గండికొడుతుండడంతో పోలీసు బాస్ ఈ వ్యవహారాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. అక్రమ ఇసుక మాఫియా వ్యవహారంతో వాగులు, నిషేధిత ప్రాంతాలను తొవ్వేస్తుండడంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగే అవకాశాలు ఉండటంతో డీజీపీ ఈ దందాను అణిచివేయాలని ఆదేశించారు. ఇక అక్రమ ఇసుక దందా జరిగితే ఆ ప్రాంత సంబంధింత పోలీసు ఉన్నతాధికారిని బాధ్యులను చేస్తామని డీజీపీ హెచ్చరించడంతో ఇసుక మాఫియాతో సంబంధాలు పెట్టుకున్న పోలీసు ఆఫీసర్ లలో కలవరం మొదలైంది.

ఎల్జీ జోన్ -2 లో గ్యాంబ్లింగ్ పేరు వినపడొద్దు : వి.సత్యనారాయణ, ఐజీ

మల్టీ జోన్-2 లో అక్రమ ఇసుక రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్ దందాలు పూర్తిగా బంద్ కావాల్సిందే. వాటి మాట కూడా వినపడొద్దు. ఈ దందాలు జరిగినా, జరుగుతున్నట్లు సమాచారం వచ్చినా, ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారుల పై చట్టపరంగా, శాఖ పరంగా చర్యలు ఉంటాయి. 9 జిల్లాల ఎస్పీలు పూర్తి బాధ్యత తీసుకుని ఈ అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాంబ్లింగ్ పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, నిర్లక్ష్యం చేస్తే అధికారులపై యాక్షన్ ఉంటుంది. ఈ నేపధ్యంలోనే గ్యాంబ్లింగ్ నిర్వహించే రఫీ, ప్రభాకర్ సేఠ్ మీద సస్పెక్ట్ షీట్ లను తెరిచామని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు.


Similar News