Kp Vivek: రెండో దశ బడ్జెట్ అంతేనా..?

ఫోర్త్ సిటీ అంటే కల్పిత నగరమని, పేపర్‌పై లేని నగరమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు..

Update: 2024-10-03 16:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోర్త్ సిటీ అంటే కల్పిత నగరమని, పేపర్‌పై లేని నగరం అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. ఫోర్త్ సిటీకి మెట్రో తీసుకువెళ్తామని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి... గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిన ప్రతిపాదనలను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ధికపరమైన నిర్ణయాలు తీసుకుంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తమ వ్యక్తిగత శ్రేయస్సు కోసం పని చేస్తోందని దుయ్యబట్టారు. హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలో ప్రజల డిమాండ్ మేరకు మెట్రో రైలు తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మెట్రో రైలును రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు తీసుకువెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, రెండవ దశ మెట్రో పనులకు 24 వేల కోట్లు బడ్జెట్ పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం 11 కోట్లు బడ్జెట్‌లో పెట్టిందని మండిపడ్డారు.

ఫోర్త్ సిటీ రేవంత్ రెడ్డి ఊహల నగరం అని దాని కోసం హైదరాబాద్ నగరాన్ని విస్మరిస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ దందా కోసమే ఫోర్త్ సిటీ అని సీఎం అంటున్నారని ఆరోపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మెట్రో అవసరం ఉందని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చెప్పారని దానికి కట్టుబడి ఉండకుండా ప్రజలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ మెట్రో సాధసమితి పేరుతో మెట్రో రైలు కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ బ్యూటిఫికేషన్ అని సీఎం అంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ప్రజల భయాందోళనకు గురి అవుతున్నారని, రియల్ ఎస్టేట్ కూదేలైందన్నారు. హైదరాబాద్ హెల్త్ సిటీ గురించి ప్రభుత్వానికి ఊసే లేదన్నారు. ప్రజా పాలన పేరుతో రేవంత్ రెడ్డి ఎవరిని కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి విధ్వంసకర నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ట మసక బారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


Similar News