రోగులను కుటుంబ సభ్యులుగా భావించాలి : మంత్రి హరీష్ రావు
రోగులను కుటుంబ సభ్యులుగా భావించినప్పుడే మెరుగైన వైద్య సేవలను అందించవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు.
దిశ, బహదూర్ పురా : రోగులను కుటుంబ సభ్యులుగా భావించినప్పుడే మెరుగైన వైద్య సేవలను అందించవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. సోమవారం పాతబస్తీలోని పేట్ల బురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మాతశిశు మరణాల సంఖ్యను తగ్గించేందుకు డాక్టర్లు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. హోదాలను బేరీజు వేసుకోకుండా డాక్టర్లు, సిబ్బంది రోగులకు వైద్య సేవలను అందించాలన్నారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారానే జీతభత్యాలు పొందుతున్నామని ఆయన గుర్తు చేశారు. మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించడంలో లక్షకు 43 మందితో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కేరళలో తక్కువ మాతా శిశు మరణాల శాతం నమోదై ప్రథమ స్థానంలో ఉందని లక్షకు 19 మంది మరణిస్తున్నారని వెల్లడించారు. మెరుగైన వైద్య సేవలను అందించడం ద్వారా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని డాక్టర్లకు సూచించారు.