దిశ, కుత్బుల్లాపూర్: విద్య అందించే ముసుగులో వ్యాపారం చేస్తూ కోట్లు పోగేసుకుంటున్న ప్రైవేట్ పాఠశాలలు హైదరాబాద్‌లో అడుగడుగునా దర్శనం ఇస్తాయి. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‌తో అరంగేట్రం చేసిన పాఠశాలలు ఫీజుల రూపేణా లక్షల రూపాయలు ప్రజల నుంచి గుంజుతూ కోట్లు పోగేసుకుంటున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు కాస్తా కమర్షియల్ వాణిజ్య కేంద్రాలుగా మారి అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాలను మోసం చేస్తున్నాయి. డబ్బులతో అధికార వ్యవస్థలను, పొలిటికల్ లీడర్స్‌ను కొంటున్న కమర్షియల్ స్కూల్స్ తాము చేసేదే చట్టంగా భావిస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి.
బరితెగింపు:
నిజాంపేట్ కార్పొరేషన్‌లో విజ్ఞాన్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తమ ఇష్టానుసారం అక్రమ భవంతులు, గదులు, భారీ షెడ్లు నిర్మిస్తోంది. లక్షలు, కోట్లలో ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పెడుతూ చట్ట విరుద్ధంగా అక్రమ నిర్మాణాలను చేపడుతుంది. పూర్వ గ్రామ పంచాయితీ అనుమతులతో పాఠశాల భవన నిర్మాణం చేపట్టిన విజ్ఞాన్ స్కూల్ నేడు తెలంగాణ మున్సిపల్ చట్టాలను లెక్కచేయకుండా భారీ నిర్మాణాలని చేపడుతుంది. గతేడాది ఈ పాఠశాలలో నిజాంపేట్ మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారం తో అనుమతులు లేకుండా అదనపు భవంతుల నిర్మాణం జరిగింది. ఆ భవంతుల నిర్మాణంతో నిజాంపేట్ మున్సిపల్ ఆదాయానికి, ప్రభుత్వ వ్యవస్థలకు సుమారు కోటి పైనే గండి పెట్టి తమ పనులు కానిచ్చుకున్నట్లు తెలు స్తోంది. పాఠశాల భవనానికి అనుమతులు పొందాలంటే ఎల్ఆర్ఎస్ క్లియర్ గా ఉండాలి, కానీ ఇక్కడ అలా కుదరదు.
ఎందుకంటే పాఠశాలలో పెద్ద మొత్తంలో అసైన్డ్ ల్యాండ్ ఉండడంతో ల్యాండ్ క్రమబద్ధీకరణ జరగదు. ఎల్ఆ ర్ఎస్ క్లియర్‌గా లేదంటే నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వడం కుదరదు. అలా విజ్ఞాన్ స్కూల్ పాఠశాలలో అదనపు భవంతులు, భారీ షెడ్లకు ఎట్టి పరిస్థితిలో తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్-2019 ప్రకారం అనుమతులు రావు. కానీ మమ్మల్ని ఎవ్వరూ అడిగేది, మాకేది అడ్డు అనే ధోరణితో నిర్మాణాలు చేపట్టంది. ఈ అక్రమ నిర్మాణాలపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు తరచుగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చెప్పట్టకాపోగా తూతూ మంత్రంగా నోటీసులిచ్చి లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్‌లో షాడో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారిణి, ఓ స్థానిక ప్రజా ప్రతినిధి విజ్ఞాన్ స్కూల్ అక్రమాలకు అండగా నిలవడంతో ఈ అక్రమాల పర్వం కొనసాగుతుంది.
చర్యలు తీసుకుంటాం - సౌజన్య, నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్
ఫిర్యాదులు తన దృష్టికి వచ్చా యని పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కార్పొరేషన్ కు పూర్తి స్థాయిలో ఏసీపీ లేనందువల్ల టౌన్ ప్లానింగ్ వ్యవస్థ పని తీరు కాస్త నెమ్మదిగా ఉందని త్వరలోనే ఏసీపీ బాధ్య తలు స్వీకరిస్తుందని ఆ తర్వా త సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతాం.