గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఓల్డ్ సిటీకి వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే
పిల్ల పుట్టకముందు కుల్లా కుట్టినట్టుంది రాష్ట్ర ప్రభుత్వ తీరు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, కారిడార్ వే ప్రాజెక్టు కింద
దిశ, సిటీ బ్యూరో: పిల్ల పుట్టకముందు కుల్లా కుట్టినట్టుంది రాష్ట్ర ప్రభుత్వ తీరు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, కారిడార్ వే ప్రాజెక్టు కిందపిల్ల పుట్టకముందు కుల్లా కుట్టినట్టుంది రాష్ట్ర ప్రభుత్వ తీరు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, కారిడార్ వే ప్రాజెక్టు కింద సుమారు రూ. 14500 కోట్లతో వివిధ రకాలుగా చేపట్టబోయే ప్రాజెక్టుల పనుల్లో ఒక్క శాతం పనులకు ఇంకా టెండర్లే ఫైనల్ కాకముందు మున్ముందు మూసీపై నిర్మించనున్న బ్రిడ్జిలపై టోల్ చార్జీలు వసూలు చేస్తామని మున్సిపల్ మంత్రి కే. తారక రామారావు మంగళవారం వ్యాఖ్యానించటం మహా నగరవాసులను తీవ్ర విస్మయానికి గురి చేసింది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద (సీఎస్ఆర్ ) కింద అభివృద్ధి చేసిన ఖాజాగూడ పెద్ద చెరువును మంగళవారం ప్రారంభించిన మంత్రి కేటీఆర్ నగరాభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక పాలనకు ముందు సమైక్య పాలనలోనూ సుమారు మూడు దశాబ్దాలుగా మూసీ ప్రక్షాళన, సుందరీకరణ అంటూ కొత్త కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేయడమే తప్ప, ఏ ఒక్క ప్రాజెక్టును పక్కాగా అమలు చేసి, మూసీ నది రూపురేఖలను మార్చటంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మూసీ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ. 400 కోట్లతో 14 బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్లు గడిచిన అయిదేళ్ల నుంచి మున్సిపల్ మంత్రి కే.తారకరామారావు వివిధ సందర్భాల్లో ప్రకటిస్తూ వస్తున్నారే తప్ప, ఎక్కడ కూడా ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చిన దాఖలాల్లేవు. కానీ ఈ 14 బ్రిడ్జిల నిర్మాణం పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తర్వాత వీటిపై రాకపోకలు సాగించాలంటే వాహనదారుల నుంచి టోల్ చార్జీలు వసూలు చేస్తామని, ఇందుకు సంబంధించిన అధ్యయనం కూడా మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు.
ముంబై మహానగరంలోని శివార్లలో ఏర్పాటు చేసిన ఇలాంటి బ్రిడ్జిలపై రాకపోకలు సాగించే వాహనదారుల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని మూసీపై నిర్మించే బ్రిడ్జిలకు వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నిర్వహించిన అధ్యయనంలో తేలిందని, టోల్ ఫీ చెల్లించేందుకు నగరవాసులు సిద్ధంగా ఉన్నారన్న నివేదికలు వచ్చినట్లు కూడా మంత్రి వెల్లడించారు.
అదనపు భారం కానున్న ఓల్డ్ సిటీ-న్యూ సిటీ ప్రయాణం
సర్కారు మూసీ నదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిలపై వాహనదారులకు టోల్ ఛార్జీలు వర్తింపజేయనున్నట్లు మంగళవారం మున్సిపల్ మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనలో మున్ముందు ఓల్డ్ టూ న్యూ సిటీ ప్రయాణం వాహనదారులకు అదనపు భారంగా మారనుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది నగర వాసులు, ముఖ్యంగా వివిధ రకాల వ్యాపారాలు చేసే వారు ప్రతి రోజు డజను సార్లు ఓల్డ్ సిటీ టు న్యూ సిటీ, న్యూ సిటీ టు ఓల్డ్ సిటీ ల మధ్య రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. ముఖ్యంగా రంజాన్, వినాయక చవితి వంటి పండుగ రోజుల్లో రాకపోకల సంఖ్య మరింత పెరుగుతుంది. బ్రిడ్జిలపై ప్రయాణించే వారికి టోల్ ఛార్జీలు వర్తింపజేస్తే, ఈ బ్రిడ్జిలపై ప్రయాణించేందుకు పెద్ద ఆసక్తి చూపరన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కాస్త ముందుకు కదిలిన బ్రిడ్జిల ప్రతిపాదన
మూసీ నదిపై రాకపోకలు మెరుగుపరిచేందుకు ట్రాఫిక్ నియంత్రణ, మూసీ సుందరీకరణ లో భాగంగా 14 బ్రిడ్జిలకు ఏళ్ల క్రితమే సర్కారు మంజూరీ ఇచ్చిన, ఇటీవలే వీటిలో రెండు బ్రిడ్జిలకు జీహెచ్ఎంసీ అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. మూసారాంబాగ్ వద్ద రూ. 58 కోట్లతో ఓ వంతెనను, అత్తాపూర్ వద్ద రూ. 32 కోట్లతో మరో వంతెనను నిర్మించేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ త్వరలోనే కొలిక్కి రానున్నట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన ప్రకారం రేపోమాపో నిర్మాణ పనులు ప్రారంభించి త్వరలోనే పూర్తి కానున్న మూసారాంబాగ్, అత్తాపూర్ బ్రిడ్జిలు అందుబాటులోకి రాగానే టోల్ ఛార్జీలు వర్తింపజేస్తారా? లేక మొత్తం 14 బ్రిడ్జిలు పూర్తయిన తర్వాత అన్నింటికి కలిపి ఒకేసారి వర్తింపజేస్తారా? అన్నదే వేచి చూడాలి.