ఎమ్మెల్యే సిఫార్సులుంటేనే పోస్టింగ్‌లు..కమిషనర్ ఆమ్రపాలికి లేఖలు పంపుతున్న ఎమ్మెల్యేలు
తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీకి చెందిన శానిటేషన్, ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు చెంది, తమ సిఫార్సు లేఖలున్న వారినే నియమించాలని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కమిషనర్ ఆమ్రపాలికి లేఖలు రాసినట్లు విశ్వసనీయ సమాచారం.
దిశ,సిటీబ్యూరో:తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీకి చెందిన శానిటేషన్, ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు చెంది, తమ సిఫార్సు లేఖలున్న వారినే నియమించాలని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కమిషనర్ ఆమ్రపాలికి లేఖలు రాసినట్లు విశ్వసనీయ సమాచారం. కమిషనర్ నియమించిన ప్రత్యేక కమిటీ సూచనలతో బదిలీలను పారదర్శకంగా చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ భావించగా, అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తాము చెప్పిన వారినే నియమించాలని, తర్వాత స్థానికంగా అభివృద్ధి పనులు వేగవంతం కావటంతో ప్రజాసమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే వాదనతో శివార్లకు చెందిన ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలకు చెందిన మెడికల్ ఆఫీసర్లు మొదలుకుని ఎస్ఎఫ్ఏల వరకు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మొదలుకుని అసిస్టెంట్ ఇంజినీర్ వరకు పేర్లను సూచిస్తూ లేఖలు రాసినట్లు తెలిసింది.
గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల వేధింపులకు గురైన అధికారులు తాము ప్రస్తుతమున్న చోట కొనసాగలేమంటూ, తమను ఇతర నియోజకవర్గాలకు మార్చాలని కూడా ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. మరికొందరు ఇప్పటికే లోకల్ ఎమ్మెల్యేలతో పడక, పక్క నియోజకవర్గానికి స్థానచలనం కలిగించాలని, అందుకు అనుకూలంగా తమకు సిఫార్సు లేఖలు ఇవ్వాలని ఎమ్మెల్యేలను వేసుకుంటున్నట్లు సమాచారం. ఉద్యోగుల అంతర్గత బదిలీలను ఎంతో పారదర్శకంగా చేయాలని కమిషనర్, అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల సిఫార్సులు వారికి తలనొప్పిగా మారినట్లు సమాచారం. కానీ హైదరాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్‌కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలుండగా, కాంగ్రెస్‌కు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉండగా, మిగిలిన వారంతా ప్రతిపక్షానికి చెందినవారుండటంతో అధికారులు వారి సిఫార్సులను లైట్‌గా తీసుకుంటారా? లేక అమలు చేస్తారా? వేచి చూడాలి.
సీఎం వచ్చాకేనా?
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సిటీకి వచ్చిన తర్వాతే, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి అంతర్గత బదిలీలు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ శాఖను నేరుగా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్నందున ఆయన దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే బదిలీలపై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సీఎం దృష్టికి తీసుకెళ్తే ఏ పార్టీ ఎమ్మెల్యే సిఫార్సులను ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలో క్లారిటీ వస్తుందని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.