పోక్సో, పిటా కేసులో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ సంరక్షణలో ఉంటున్న ఒక మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని, మాయమాటలతో లొంగదీసుకుని,

దిశ, చైతన్యపురి : చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ సంరక్షణలో ఉంటున్న ఒక మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని, మాయమాటలతో లొంగదీసుకుని, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడమే కాక ఆ బాలికను వ్యభిచార కూపంలోకి దింపిన సంఘటన 2019 లో జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన యార్లగడ్డ చంటి(25) ఎన్ టి ఆర్ నగర్ హరిపురి కాలనీలో ఉంటూ అమెజాన్ లో డ్రైవర్ గా పనిచేసేవాడు. అతని భార్య యార్లగడ్డ పుష్ప (20), కేతావత్ కృష్ణవేణి (28 ), గోదా రాధ అలియాస్ మల్లేశ్వరి (50) లు కలిసి తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ వద్ద ఉంటున్న మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరకు తీసుకున్నారు. యార్లగడ్డ చంటి బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను వ్యభిచారం కూపం లోకి దింపాడు. అప్పట్లో పొక్సో, పిటా కేసు నమోదు చేశారు.
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో పోక్సో చట్టం, పిటా చట్టం అత్యాచారం చట్టం ప్రకారం ఎల్బినగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి పైన పేర్కొన్న నిందితులని దోషులుగా నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చంటికి జీవిత ఖైదు శిక్ష, రూ.1 లక్ష 30 వేలు జరిమానా, పుష్పకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 30 వేలు జరిమానా విధించారు. కృష్ణవేణి, మల్లేశ్వరి లకు ఒక్కొక్కరికీ 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1లక్ష 25 వేలు జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.15 లక్షలు, ఈ నిందితుల మూలంగా లైంగిక వేధింపులకు గురైన మరో బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం అందించారు. ఈకేసులో న్యాయమూర్తి ఎంకె. పద్మావతి తీర్పు వెల్లడించగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత, ఎం. రఘు వాదనలు వినిపించారు.