కబ్జా కోరల్లో ఉస్మానియా యూనివర్సిటీ భూమి...
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ భూములను పూర్తిస్థాయిలో కాపాడటంలో యూనివర్సిటీ అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు
దిశ, సికింద్రాబాద్: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ భూములను పూర్తిస్థాయిలో కాపాడటంలో యూనివర్సిటీ అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. యూనివర్సిటీ భూములు నేడు కబ్జా కోరల్లో చిక్కుకుని అన్యాక్రాంతం అయ్యే ప్రమాదంలో ఉన్నాయి. యూనివర్సిటీ చుట్టూ ఉన్న తార్నాక, మాణికేశ్వరి నగర్, డీడీ కాలనీ, రామంతపూర్, హబ్సిగూడ ప్రాంతాల్లో 1647 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా యూనివర్సిటీ భూభాగం ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు యూనివర్సిటీ భూములకు ఆనుకొని ఉండడంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. మరి కొందరివి కోర్టు కేసులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క కబ్జాలు, మరోపక్క లీజులతో యూనివర్సిటీ భూమి కాలక్రమమైన కోల్పోతు వస్తుంది.
లీజుల పేరుతో ఆక్రమించిన వ్యాపార సంస్థలు..
యూనివర్సిటీ భూ భాగంలో లీజుల పేరుతో సుమారు వంద ఎకరాల స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించారు. మరి కొంత భాగం ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పజెప్పి నప్పటికీ, మరికొంత భాగం లీజుకు నడుస్తుంది. ఎన్నో ఏళ్లుగా లీజుకు తీసుకొని కొందరు వ్యాపారస్తులు తమ తమ వ్యాపారాలు సాగిస్తున్నారు. రామంతపూర్ పరిధిలోని హోమియోపతి ఆసుపత్రి, దూరదర్శన్ కేంద్రం, తార్బల్లోని ఆర్టీసీ హాస్పిటల్, హెచ్ఎండిఎ భవనం, ఎన్ఐఎన్, ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ తో పాటు మూడు పెట్రోల్ బంకులు, పలు ప్రైవేటు స్కూల్స్ కూడా లీజులో నడుస్తున్నాయి.
కబ్జా కోరల్లో యూనివర్సిటీ భూమి...
యూనివర్సిటీ భూభాగం చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకొని ఉండటంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. మరి కొంతమంది తమదే భూమి అంటూ కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఒకపక్క కోర్టులో కేసులు నడుస్తున్న, మరో పక్క కబ్జా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. హబ్సిగూడ, రామంతపూర్, డిడి కాలనీ, మాణికేశ్వరి నగర్ వైపు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించినప్పటికీ కబ్జాల పరంపర ఆగడం లేదు. దీనికి తోడు క్యాంపస్లో పలు బస్తీలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు అక్కడే జీవనం సాగిస్తున్నారు. వీరి కారణంగా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే భూములు అన్యాక్రాంతమవుతున్నాయి..
యూనివర్సిటీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే వందలాది ఎకరాల యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని పలువురు విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి పర్యవేక్షణ లేని కారణంగానే కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారని చెబుతున్నారు. గతంలో హబ్సిగూడ వైపు కొందరు దొంగచాటుగా నిర్మాణాలు చేయడానికి ప్రయత్నిస్తే విద్యార్థులు అడ్డుకున్న సంఘటనలు గుర్తు చేశారు.
ఓయూ భూములను కాపాడాలి: బహుజన స్టూడెంట్ జాక్ చైర్మన్, యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేల్పుల సంజయ్..
యూనివర్సిటీ భూమి ఎంతో విలువైన, గజం లక్షల్లో పలుకుతుందని, అందుకే కబ్జాదారులు రెచ్చిపోతున్నారని చెప్పారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్ళు తెరిచే పూర్తిస్థాయిలో యూనివర్సిటీ భూములకు రక్షణ కల్పించాలని కోరారు. గతంలో చుట్టూ ప్రహరీ గోడ నిర్మించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించి కబ్జా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా లీజుల పేరుతో అతి తక్కువ రెంట్ చెల్లిస్తున్న వ్యాపార సంస్థల లీజులు రద్దుచేసి యూనివర్సిటీ భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులుగా తాము యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ, అధికారుల నుంచి స్పందన లేదన్నారు.
యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని హైడ్రాకు విద్యార్థులు వినతి..
యూనివర్సిటీ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని విలువైన వర్సిటీ భూమిని పరిరక్షించాలని విద్యార్థులు హైడ్రా కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందించారు.