‘అలయ్ బలయ్ ’లో బీజేపీ నేతలు చేసిన కీలక వ్యాఖ్యలివే..

వచ్చే ఎన్నికల్లో బీజేపీ పోటీలో లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకుంటే సరిపోతుందా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు...

Update: 2023-10-25 15:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీజేపీ పోటీలో లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకుంటే సరిపోతుందా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బుధవారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన ఆయన రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించారు. ఎవరి ఊహలు వారివని, ఎవరి ఇష్టం వారిదని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ పోటీలో లేదని వారనుకున్నంత మాత్రాన సరిపోదని పేర్కొన్నారు.

అనంతరం రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ జాతీయ స్థాయిలో మంచి స్థానం కల్పించిందని చెప్పారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు రక్తం చిందిస్తున్నారన్నారు. అలాంటి పార్టీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని రాజగోపాల్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో పార్టీలో చేరి ఇప్పుడు నిందలు వేయడం బాలేదని ఫైరయ్యారు. వ్యక్తిగతంగా ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదని హెచ్చరించారు. కచ్చితంగా ప్రధాని మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నట్లు లక్ష్మణ్ స్పష్టం చేశారు.

మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తాను పార్టీ మారుతానని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోందని, అదంతా తప్పు అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచే పోటీచేస్తానని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా గురించి తనకు తెలియదని వెల్లడించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఇన్ని రోజులు రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉందని, ఆత్మ కాంగ్రెస్ లోనే ఉందని తెలిపారు. ఇది బ్రేకింగ్ న్యూసేమీ కాదని, అందరూ ఊహించినదేనని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన.. బీఆర్ఎస్ కు.. బీజేపీ ప్రత్యామ్నాయం కాకుండా పోదని, ఆయన చెప్పేవన్నీ అవాస్తవాలని ఫైరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిల్లో జనాలు లేరని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్ నుంచి ఖాళీ చేయించే పనిలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఉన్నారన్నారు. తనకు భువనగిరి పార్లమెంట్ చేయాలని ఉందని, కానీ.. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే ఆదేశిస్తే.. అక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన పేర్కొన్నారు.

మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి పాసింగ్ క్లౌడ్ అని పేర్కొన్నారు. పార్టీ ఎప్పుడూ బలంగానే ఉంటుందని, కొందరు అలా వచ్చి.. ఇలా వెళ్తారన్నారు. తాను ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా తన కుమారుడి కోసం మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం కోసం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంచేశారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ డబ్బు సంచులను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తోందని ఆరోపించారు. మొన్నటికి మొన్న.. బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారని ఫైరయ్యారు. తాను రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇంకా చదవలేదన్నారు. హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్లా తానే గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోనని చెప్పారు.

మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరమన్నారు. ఆయనకు బీజేపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెసే.. ప్రత్యామ్నాయం అని భావించి అందరూ అటు వైపు మళ్లుతున్నారని, కానీ భవిష్యత్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనిపేర్కొన్నారు. తాను కూడా పార్టీ మారుతున్నానని ప్రచారం జరుగుతోందని, గాలికి వచ్చి వెళ్ళేవాడిని తాను కాదని వెల్లడించారు. బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు.

Tags:    

Similar News