దర్జాగా ఫుట్ పాత్ కబ్జా…పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు
రోజురోజుకు పుట్ పాత్ ఆక్రమణలు జోరందుకున్నాయి. సాధారణ రోడ్లపైనే కాదు.
దిశ,కార్వాన్ : రోజురోజుకు పుట్ పాత్ ఆక్రమణలు జోరందుకున్నాయి. సాధారణ రోడ్లపైనే కాదు. వీఐపీ మూవ్‌మెంట్ ఉండే రోడ్ల పరిస్థితి అలాగే మారింది. లక్డీకాపూల్ నుండి మెహిదీపట్నం వైపు వెళ్లే మహావీర్ ఆసుపత్రి ఎదురుగా ఉండే టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా కార్యాలయం చుట్టూ ఆక్రమణలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఈ రూట్లో నిత్యం ఏదో ఒక సమయంలో వీఐపీ మూమెంట్ ఉంటుంది. సీఎం సహా ఇతర మంత్రులందరూ ఇదే దారిలో వెళ్తుంటారు. ఇక్కడ వెలసిన వాణిజ్య సముదాయాల ముందు పుట్ పాత్ లను సైతం ఆక్రమించారు. పుట్ పాత్ బిజినెస్ కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్డుకు ఇరువైపులా వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. వాణిజ్య సముదాయాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, పుట్ పాత్ లు ఆక్రమణలకు గురి కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ అంతరాయం ట్రాఫిక్ పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చినట్లవుతోంది. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత, పాదచారుల ఆందోళనలు అధికం కావడంతో పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
ఇక సర్కిల్-12 టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా వారు బయట తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. పాదచారులు అడుగు పెట్టడానికి కూడా చోటు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. గడచిన నెల రోజుల కాలంలో మూడు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా మరో ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల మరొక ఘటనలో ఒక డ్రైవర్ మద్యాన్ని సేవించి నీలోఫర్ కేఫ్ వద్ద బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో 12 మంది గాయాల పాలయ్యారు. పాదచారుల విషయంలో హైకోర్టు గతంలో సీరియస్ గా ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది స్పందించి టీఎన్జీవో రంగారెడ్డి జిల్లా కార్యాలయం వద్ద వెలసిన పుట్ పాత్ ఆక్రమణలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.