తెలంగాణ నుంచి జాతీయస్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరు

తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని ఆదేశించినట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-05 11:04 GMT

దిశ, రవీంద్రభారతి : తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని ఆదేశించినట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాకా పేదల మనిషని పేర్కొన్నారు. ఆనాడు సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. శనివారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకటస్వామి (కాకా) 95వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, ఆత్మీయ అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్​ కోదండరాం, ఎంపీ మల్లు రవి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అనాథలను చేయమన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వానిదని, మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రెచ్చగొట్టేవారి మాటలు నమ్మొద్దని సూచించారు. ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకు పేదల ముసుగు అడ్డుపెట్టుకునే వారి మాటలు వినొద్దని కోరారు. మూసీ పరీవాహక పేదలను ఆదుకునేందుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకోవాలో ఈటెల, కేటీఆర్, హరీష్​రావు సూచించాలని కోరారు. నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారని, మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

     కాకా స్పూర్తితో పేదలకు మెరుగైన వసతులు కల్పిద్దాం అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ లో కొంత భూమిని దానం చేయాలని సూచించారు. మీరు ఫామ్ హౌసు​ల్లో జమీందారుల్లా బతుకుతారు కానీ పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? అని అన్నారు. అవసరమైతే మలక్ పేట్ రేస్ కోర్టును, అంబర్ పేట్ పోలీస్ అకాడమీని హైదరాబాద్ బయటకు తరలించి అక్కడ పేదలకు ఇండ్లు కట్టిస్తాం అన్నారు. మీ ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండన్నారు. ఐదేళ్లలో బీఆర్​ఎస్​ పాలనలో చేసిన రుణమాఫీ కేవలం రూ.11వేల కోట్లని, నెలరోజుల్లో తాము రూ.18 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. రైతులెవరూ రోడ్డెక్కొద్దని, సమస్య ఉంటే కలెక్టర్ ను కలవాలని కోరారు. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారని, వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గడ్డం, వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావు, చాడ వెంకట్ రెడ్డి, ఎంపీ వంశీ, మాజీ మంత్రి శంకర్ రావు, మాజీ ఎంపీ మధుయాష్కి పాల్గొన్నారు. 

Tags:    

Similar News