శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలి
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
దిశ, హైదరాబాద్ బ్యూరో : శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధిలో మంగళవారం పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, ట్రాన్స్కో, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, అగ్నిమాపక, దేవాదాయ, రవాణా, ఇరిగేషన్, హెచ్ఎం డబ్ల్యూఏ, సమాచార శాఖ అధికారులు, జంట నగరాల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులతో గణేష్ ఉత్సవాలు - 2024 పై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ శాఖలతో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముంబాయితో సమానంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజల సహకారంతో ప్రభుత్వం రంజాన్, మొహర్రం, బోనాలు విజవంతంగా జరుపుకున్నామని అన్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలను వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉత్సవాలను శాంతియుతంగా అత్యంత ఘనంగా జరుపుకోవాలని అన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా రౌండ్ క్లాక్ పర్యవేక్షణ చేయాలన్నారు.
మండపాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ అధికారులను డిప్యూట్ చేయాలన్నారు. చెరువులు, కుంటలలో నీరు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గణేష్ ఉత్సవాల వేదికలపై, ఊరేగింపులలో సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, కళాకారులు పాల్గొంటారని తెలిపారు. భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి, బాలపూర్ ఉత్సవ కమిటీలు అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపాయన్నారు. నగరంలో రోడ్లపై ఉన్న గుంతలను యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేస్తామని మంత్రి తెలిపారు. గణేష్ ఉత్సవ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు రవాణా శాఖ, మెట్రోలో అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ అన్ని వర్గాలకు సంబంధించిన గొప్ప పండుగ వినాయక చవితి అని, అందరి సహకారంతో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రకృతిని కాపాడేందుకు ప్రతి పౌరుని సహకారం అవసరమని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాలతో పూజలు చేయాలని మంత్రి సూచించారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యుల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. శాంతిభద్రతలకు విగఘాతం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.
విగ్రహాల తరలింపులో ఎక్కడా కూడా చెట్ల కొమ్మలు అడ్డు రాకుండా తొలగించాలని, వేలాడుతున్న విద్యుత్ వైర్లను గుర్తించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ నిర్దేశించిన సమయానికి నగరంలోని రోడ్ల మారమ్మతులు చేపడతామన్నారు. త్వరలో అన్ని ప్రాంతాలను పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో రాజ్య సభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, శాసన సభ్యులు దానం నాగేందర్, డీజీపీ జితేందర్, రెవెన్యూ శాఖా ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్లు అనుదీప్ దూరిశెట్టి, గౌతమ్ పొట్రూ, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్సీలు, శాసన సభ్యులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.