క్యాస్ట్ ఈక్వేషన్ అడ్జెస్ట్‌మెంట్‌లో సమస్యలు... కేబినెట్ విస్తరణపై తర్జన భర్జన...?

మంత్రి వర్గ విస్తరణపై ఒత్తిడి చేయొద్దని రాష్ట్ర నేతలకు ఏఐసీసీ సూచించినట్లు సమాచారం తెలుస్తోంది..

Update: 2024-10-21 02:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి వర్గ విస్తరణపై ఒత్తిడి చేయొద్దని రాష్ట్ర నేతలకు ఏఐసీసీ సూచించినట్లు సమాచారం. మంత్రి వర్గ విస్తరణ అంశాన్ని తమ వద్ద ప్రస్తావించొద్దని రాష్ట్రానికి చెందిన ఓ కీలక నేతకు ఏఐసీసీ చీఫ్ చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ ఎవరికి వారు తమదైన శైలీలో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి కేబినెట్ విస్తరణ బ్రేక్‌కు క్యాస్ట్ ఈక్వేషన్సే ప్రధాన కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే సుదీర్ఘంగా కసరత్తు చేసిన పీసీసీ, ఏఐసీసీ కొన్ని పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. కానీ మహారాష్ట్ర ఎన్నికల తర్వాతే ప్రకటించాలని ఫిక్స్ అయింది. తెలంగాణ కేబినేట్ విస్తరణ అంశం బీజేపీకి అస్త్రంగా మారకూడదనేది ఏఐసీసీ ఆలోచన. క్యాస్ట్ ఈక్వేషన్ అడ్జెస్ట్‌లో చిన్న చిన్న సమస్యలు ఉంటే, వాటిని హైలెట్ చేస్తూ మహారాష్ట్రలో బీజేపీ లాభం పొందాలని చూస్తోందనే అభిప్రాయం ఏఐసీసీలో ఉన్నది. దీంతోనే కొత్త మంత్రుల ప్రకటనను జాప్యం చేస్తున్నారు. హర్యానా ఎన్నికల తర్వాత కొన్ని బెర్త్ లను ప్రకటించాలని భావించినప్పటికీ, ఆ తర్వాతే మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఆలస్యమైనా, ఎన్నికల్లో ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలని ఏఐసీసీ జాగ్రత్త పడుతోంది.

ఆ ప్లేస్ లో నేతలు ఎవరు..?

ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బెర్త్ కోసం పోటీ పడుతున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి మరిన్ని మంత్రి పదవులు ఇవ్వొద్దని హైకమాండ్ భావిస్తే బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు ఇచ్చే ఛాన్స్ ఉందనే టాక్ ఉన్నది. అయితే మల్ రెడ్డి రంగారెడ్డి మాత్రం తనకు బెర్త్ కన్ఫమ్ అయిందనే భరోసాతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఉమ్మడి హైదరాబాద్ నుంచి ఒక మైనార్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. అయితే ఈ జిల్లా పరిధిలో మైనార్టీ నేతలు ఎవ్వరూ గెలవలేదు. దీంతో మైనార్టీ కి మంత్రి పదవి ఇవ్వాలంటే కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవ్వాలి. ఇటీవల అసెంబ్లీ టిక్కెట్లు పొంది ఓడిపోయిన షబ్లీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ లకు ఇస్తారా? ఇతర నాయకులను ఎంపిక చేస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు కు దాదాపు కన్ఫమ్ అనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ నుంచి కూడా సుదర్శన్ రెడ్డికి పక్కా అని పార్టీ నేతలు చెప్తున్నారు. పెండింగ్ లోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు కేటాయించిన తర్వాత, మరో రెండు బెర్త్ లు ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటి కోసం పోటీ నెలకొన్నది. అయితే ఇందులో బీసీ సామాజిక వర్గ నేత వాకిటి శ్రీహరికి కన్ఫామ్ అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సీటు కోసం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కూడా ట్రై చేస్తున్నారు. ఇక మరో బెర్త్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. తనకు పార్టీలో చేరేటప్పుడే హామీ ఇచ్చారని, ఆ తర్వాత భువనగిరి ఎంపీని గెలిపించాల్సిన బాధ్యత అప్పగించిన సమయంలోనూ చెప్పారని, ఇప్పుడు ఇవ్వాల్సిందేనంటూ పట్టుపడటం గమనార్హం. అయితే హైకమాండ్ నిర్ణయంపై సస్పెన్స్ నెలకొన్నది.

ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూనే..?

ప్రస్తుతం రాష్ట్రంలో సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరు బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి. వీటిని జిల్లాలు, క్యాస్ట్ ఈక్వెషన్ ను పరిగణలోకి తీసుకొని భర్తీ చేస్తామని గతంలోనే సీఎం హామీ ఇచ్చారు. దీంతో మంత్రి పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు తమదైన శైలీలో ప్రయత్నాలు జరుపుతున్నారు. ప్రస్తుతం కేబినేట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈసారి ఈ జిల్లాలకు అవకాశం కల్పిస్తూనే సామాజిక వర్గాల వారీగా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే సీఎంతో కలిపి ఏడుగురు ఓసీ, ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేబినేట్‌లో ఉన్నారు. దీంతో ఈ దఫా బీసీ (ముదిరాజ్‌‌, కురుమ), మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు పార్టీ వర్గాల్లో లీకులు వెలువడ్డాయి.


Similar News