బదిలీల భయం.. బల్దియాలో ఐదేళ్లు దాటిన ఆఫీసర్ల గుండెల్లో దడ

సర్కారు చేపట్టిన ఉద్యోగుల బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీలో ఒకే చోట, ఒకే విభాగంలో అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఉద్యోగులు, అధికారుల్లో దడపట్టుకుంది.

Update: 2024-07-10 02:41 GMT

దిశ, సిటీబ్యూరో : సర్కారు చేపట్టిన ఉద్యోగుల బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీలో ఒకే చోట, ఒకే విభాగంలో అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఉద్యోగులు, అధికారుల్లో దడపట్టుకుంది. గత కమిషనర్ రొనాల్డ్ రోస్ ఒకే చోట, ఒకే విభాగంలో మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న ఉద్యోగుల వివరాల సేకరణ కోసం సర్కిళ్ల వారీగా స్పెషల్ కౌంటర్లను సైతం ఏర్పాటు చేసి, ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చారు. బదిలీలు చేసే సమయంలో కమిషనరే బదిలీ కావటం, కొత్త కమిషనర్‌గా ఆమ్రపాలి రావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో అప్పటి వరకు తాము బదిలీ అవుతామని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులు కొంత ఊపరిపీల్చుకున్నారు. ఇప్పుడు తాజాగా సర్కారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ బదిలీలకు తెరలేపడంతో జీహెచ్ఎంసీలో ఏళ్లతరబడి విధులు నిర్వహిస్తున్న అధికారుల గుండెల్లో దడపట్టుకుంది.

ఏళ్లతరబడి జీహెచ్ఎంసీలోనే కొనసాగుతూ, ఇటీవలే కీలకమైన బాధ్యతలు చేపట్టిన అదనపు కమిషనర్ స్థాయి అధికారులు సైతం ఎలాగో రేపోమాపో బదిలీపై వెళ్తామంటూ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 143 స్థానిక సంస్థలుండగా, వీటిలో రెండు గ్రేటర్, మరో 11 కార్పొరేషన్లున్నాయి. ఈ కార్పొరేషన్లలో ఎక్కువ స్థానిక సంస్థలకు ఐఏఎస్ ఆఫీసర్లనే కమిషనర్లుగా నియమించడంతో మిగిలిన స్థానిక సంస్థలుగా చెప్పుకునే మున్సిపాలిటీల స్థాయిల్లో కూడా బదిలీలు జరుగుతుండడంతో ప్రస్తుతం గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు, స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లు సైతం తమకు కూడా స్థానచలనం కలుగుతుందన్న భయంతో ఉన్నట్లు సమాచారం. తమకు కూడా స్థానచలనం కలుగుతుందా? కలిగితే ఎక్కడకి పంపుతారు? ఎలాగో కార్పొరేషన్లలో కమిషనర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లను నియమిస్తుండగా, నాన్ ఐఏఎస్, స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్లను ఎక్కడకు బదిలీ చేస్తారన్న అయోమం నాన్ ఐఏఎస్ మున్సిపల్ కమిషనర్లను వెంటాడుతుంది.

లాంగ్ డిప్యూటేషన్ల సీట్లు కదలుతాయా?

వివిధ ప్రభుత్వ శాఖల నుంచి జీహెచ్ఎంసీకి డిప్యూటేషన్లపై వచ్చి, గడువు ముగిసినా, ఇక్కడే తిష్టవేసిన లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్ల సీట్లు ఇప్పటికైనా కదులుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటేషన్ల గడువు ముగిసిన తర్వాత కొనసాగుతున్న వారు, రిటైర్ అయిన తర్వాత పైరవీలు చేసుకుని ఇంకా డ్యూటీలో ఉన్న వారితో కలిపి మొత్తం వెయ్యి మంది జీహెచ్ఎంసీలో తిష్టవేసినట్లు సమాచారం. వీరిలో రాష్ట్రంలో సర్కారు మారిన తర్వాత రొనాల్డ్ రోస్ కేవలం సింగిల్ డిజిట్‌లో మాత్రమే ఆఫీసర్లను ఇంటికి పంపగలిగారు. మిగిలిన వారు కొనసాగుతున్నారు. సర్కారు భారీఎత్తున చేపట్టిన ప్రక్షాళనలో భాగంగా బదిలీల్లో వైద్యారోగ్య శాఖ నుంచి జీహెచ్ఎంసీలో మెడికల్ ఆఫీసర్లుగా వచ్చి, ఇక్కడ సీట్లకు అతుక్కుపోయిన ఆఫీసర్లకు ఇప్పటికైనా బదిలీ అవుతుందా? వారు జీహెచ్ఎంసీని వీడుతారా? అన్న చర్చ జరుగుతుంది. ఇటు జీహెచ్ఎంసీ నుంచి అటు వైద్యారోగ్య శాఖ నుంచి సైతం ఎలాంటి ఆదేశాల్లేకుండా కొనసాగుతున్న వారిని తమ మాతృశాఖలకు, రిటైర్డు అయిన కొనసాగుతున్న వారిని ఈ బదిలీల ప్రక్రియ ఇంటికి పంపుతుందా? వేచిచూడాలి.


Similar News