గ్రేటర్‌లో యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్న వాహనదారుల్లో మార్పులు రావడం లేదు. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.

Update: 2024-08-26 02:46 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్న వాహనదారుల్లో మార్పులు రావడం లేదు. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా యువత వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా రోడ్లపై వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ వంటి అనేక రకాల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి విషయాలలో పట్టబడి కేసులు నమోదైతే వారి భవిష్యత్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు.

అవగాహన కల్పిస్తున్నా..

గత కొంతకాలంగా కళాశాలలు, పాఠశాలలతో పాటు ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలుకు పంపిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినా వందల సంఖ్యలో మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడడం పరిస్థితికి అద్దంపడుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నగరవ్యాప్తంగా ప్రతిరోజూ చేపడతామని, పట్టుబడితే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని పోలీసులు ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. రూ.వేలల్లో జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని మందుబాబులకు వార్నింగ్ ఇస్తున్న.. పోలీసుల ఆదేశాలను పట్టించుకోవడం లేదు. తాగి వాహనం నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోతూనే ఉన్నారు.

28 శాతం పెరిగిన కేసులు..

హైదరాబాద్ నగరంలో గత సంవత్సరంతో పోలిస్తే 28 శాతం జరిమానాలు పెరిగాయి. గ్రేటర్ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల అమలుకు పోలీస్ యంత్రాంగం ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా వాహనదారులలో మార్పు రావడం లేదు. 2023 సంవత్సరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 14.2 లక్షల మందిపై కేసులు నమోదు కాగా ఈ యేడాది మే వరకే 18.15 లక్షల మందిపై ఉల్లంఘనల కేసులు నమోదయ్యాయి. ఇది పోయిన సంవత్సరంతో పోలిస్తే 28 శాతం అధికంగా ఉంది. ముఖ్యంగా రాంగ్ రూట్, నెంబర్ ట్యాంపరింగ్, సిగ్నల్ జంప్, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి కేసులు అధికంగా నమోదౌతున్నట్లు అధికారులు గుర్తించారు. వీటి నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని వారు సంకల్పించారు.


Similar News