దిశ, చార్మినార్ : వేసవి సెలవులు ముగియడంతో సోమవారం హైదరాబాద్ పాతబస్తీలో స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి. కొన్ని ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యం నయా దందా మొదలుపెట్టింది. స్కూల్ ఫీజులు కూడా ఈ విద్యా సంవత్సరానికి 2023 - 2024 నకు గాను ఘననీయంగా పెంచింది. నర్సరీకి ఒక్కొక్క విద్యార్థికి రూ.12వేలు నుంచి రూ.25వేలు వసూలు చేస్తున్నారు. కేవలం రూ.12వేలు అయితే స్కూల్ ఫీజు మాత్రమేనని, బుక్స్, యూనిఫాం, టై, బెల్ట్, సాక్స్‌లు వేరుగా కొనుక్కోవాలని , ఒక వేళ రూ.25వేలు కడితే డొనేషన్‌తో సహా అన్నీ అందులోనేనని అమాంతం పాఠశాల స్కూల్ ఫీజులను పెంచేశాయి. ఇంకా కొన్ని కార్పొరేట్ పాఠశాలలో మాత్రం రూ.30వేల నుంచి రూ.60వేల వరకు వసూలు చేస్తున్నారు. 10వ తరగతికి రూ.రూ.25 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు.
కేవలం స్కూల్ ఫీజులు మాత్రమేనని, బుక్స్, యూనిఫాంలకు సెపెరేట్‌గా వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా పాఠశాలలోనే తప్పనిసరిగా బుక్స్ కొనుక్కోవాలని నిబంధనలు పెట్టి డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారు. వర్క్ బుక్స్‌పై ఎన్న ఎంఆర్పి ధరలను బ్లాక్ ఇంక్‌తో కొట్టేవేసి మరీ అదనపు ధరలు వేసి అచ్చం ఎంఆర్పీ ధరలలానే ముద్రిస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి వర్క్ బుక్స్ వెనుక అదనంగా రూ.500 వసూలు చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం కారణంగానే ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యం ముక్కుపిండి అధిక ఫీజులు, వర్క్స్ బుక్స్‌పై అధిక రేట్లతో డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రయివేట్ పాఠశాలలకు ఫీజు నిబంధనలు విధించాలని, రాష్ట్ర ప్రభుత్వం విధించే ఫీజులను ప్రయివేట్ పాఠశాలల పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమించే పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.