వరద ముప్పు, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు హైడ్రా చర్యలు

హైదరాబాద్ నగరంలో 30 ప్రధాన వాటర్ లాగింగ్ పాయింట్ల సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్ తెలిపారు.

Update: 2024-10-19 23:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలో 30 ప్రధాన వాటర్ లాగింగ్ పాయింట్ల సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్ తెలిపారు. వ‌ర‌ద నీరు నిలుస్తున్న ప్రాంతాల‌తో పాటు ట్రాఫిక్ స్తంభిస్తున్న ప్రాంతాల‌ను క్షేత్ర స్థాయిలో శ‌నివారం హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్, నగర ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ పి. విశ్వప్రసాద్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. హైడ్రా, ట్రాఫిక్‌, జీహెచ్ఎంసీ అధికారుల‌తో క‌లిసి క్షేత్రస్థాయిలో స‌మ‌స్యల‌ను స‌మీక్షించారు. లకిడికపూల్, రాజ్ భవన్ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్లను తనిఖీ చేసి వరద ముప్పు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. లకిడికాపూల్ పరిసర ప్రాంతాల్లో గతంలో వుండే వరద నీటి కాలువ శిథిలమైన తీరును గమనించి పున‌రుద్ధ‌రించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్యల‌ను రంగనాథ్ సూచించారు. ద్వారక హోటల్ ముందు నుంచి లక్కీ రెస్టారెంట్ మీదుగా భూగర్భ కాలువ ద్వారా గతంలో వరద నీరు సాఫీగా ప్రవహించేద‌ని.. ఈ కాలువ ఎక్కడిక‌క్కడ శిథిల‌మై, పూడుకుపోవ‌డంతో స‌మ‌స్య త‌లెత్తుతోంద‌ని జీహెచ్ ఎంసీ స‌ర్కిల్ 17 ఈఈ వెంక‌ట నారాయ‌ణ‌ వివరించారు. గ‌తంలో ఈ వ‌ర‌దంతా ల‌కిడికాపూల్‌ రైల్వే వంతెన కింద‌కు సాఫీగా సాగేద‌ని.. ఇప్పుడు మ‌ళ్లీ ఆ కాలువ‌ను పున‌రుద్ధరించాలంటూ అధికారుల‌కు రంగనాథ్ ఆదేశాలు జారీచేశారు.

ల‌కిడికాపూల్ చౌర‌స్తాలో వ‌ర‌ద‌నీటి కాలువ ప్రవ‌హించే తీరును ఆశాంతం ప‌రిశీలించి.. రైల్వే వంతెన కింద‌కు వ‌ర‌ద నీరు ప్రవ‌హించ‌కుండా ఉన్న అడ్డంకుల‌ను రైల్వే ట్రాక్ మార్గంలో న‌డిచి హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ. రంగ‌నాథ్‌ న‌గ‌ర ట్రాఫిక్ విభాగం అద‌న‌పు క‌మిష‌న‌ర్ పి. విశ్వప్రసాద్ పరిశీలించారు. వారం రోజుల్లో వ‌ర‌ద కాలువ‌ల‌ను పున‌రుద్ధరించాల‌ని.. అప్పటికీ వ‌ర‌ద ముప్పు త‌ప్పని ప‌రిస్థితుల్లో ఈ వ‌ర్షాకాలానికి తాత్కాలిక చ‌ర్యలు చేప‌ట్టి.. వచ్చే వేస‌విలో కాలువ‌ను విస్తరించాల‌ని నిర్ణయించారు. అక్కడిక‌క్కడే జోన‌ల్ క‌మిష‌న‌ర్ అనురాగ్ జ‌యంతితో మాట్లాడి హైడ్రా డీఆర్ఎఫ్ బృందంతో క‌లిసి స‌మ‌స్య ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌ గురించి రంగనాథ్ చ‌ర్చించారు. అనంత‌రం రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో వాట‌ర్‌లాగింగ్ పాయింట్లను ప‌రిశీలించారు.

రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో 10 ల‌క్షల లీట‌ర్లకు పైగా సామ‌ర్థ్యం ఉన్న రైన్ వాట‌ర్ హోల్డింగ్‌ నిర్మాణాల ప‌రిశీలించారు. గ‌తంలో 2 సెంటీమీట‌ర్ల కంటే ఎక్కువ వ‌ర్షం ప‌డితే రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో నీరు నిలుచుండేద‌ని, ఈ వాట‌ర్ హోల్డింగ్ నిర్మాణాల‌తో 5 సెంటీమీట‌ర్ల వ‌ర్షపాతం వ‌ర‌కూ వ‌ర‌ద ముప్పు తొలిగింద‌ని స్థానిక అధికారులు వివరించారు. 5 సెంటీమీట‌ర్ల కంటే ఎక్కువ వ‌ర్షం ప‌డితే అక్కడ చేప‌ట్టాల్సిన చ‌ర్యల‌తో పాటు.. వాట‌ర్ ఇంజిన్లు పెట్టి తోడించేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించారు. ఇలా న‌గ‌రంలోని 30 ప్రధాన‌మైన వాట‌ర్‌ లాగింగ్ ప్రాంతాల ముప్పును తొలుతు తొల‌గించాల‌ని నిర్ణయించారు. వారం రోజుల త‌ర్వాత మ‌ళ్లీ అవే ప్రాంతాల‌లో ట్రాఫిక్‌, జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల‌తో క్షేత్రస్థాయిలో ప‌రిశీలించి ప‌నుల పురోగ‌తిని, స‌మ‌స్య ప‌రిష్కారం అయిన తీరును తెలుసుకోనున్నట్టు రంగనాథ్ వెల్లడించారు. న‌గ‌రం మొత్తమ్మీద ఎక్కడా వ‌ర‌ద నీటిలో ర‌హ‌దారులు మున‌గ‌కుండా చూడాల‌నేది హైడ్రా ల‌క్ష్యమని తెలిపారు.


Similar News