గ్రూప్-1 అభ్యర్థుల్లో ఉత్కంఠ.. నేడే ప్రభుత్వ ప్రకటన

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై అభ్యర్థుల్లోని ఆందోళన, అనుమానాల సంగతి ఎలా ఉన్నా.. దీన్ని రాజకీయంగా మల్చుకోడానికి బీజేపీ, బీఆర్ఎస్ వాటి వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

Update: 2024-10-20 02:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై అభ్యర్థుల్లోని ఆందోళన, అనుమానాల సంగతి ఎలా ఉన్నా.. దీన్ని రాజకీయంగా మల్చుకోడానికి బీజేపీ, బీఆర్ఎస్ వాటి వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు గ్రూప్-1 అభ్యర్థుల అసంతృప్తి ప్రధాన అస్త్రంగా తయారైంది. వారిని తెలంగాణ భవన్‌కు పిలిపించుకుని చర్చల పేరుతో కేటీఆర్ మూడు రోజుల క్రితం హడావిడి క్రియేట్ చేశారు. కొద్దిమందిని చేరదీసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారు. సరిగ్గా పరీక్ష జరిగే ఈ నెల 21న తేదీన ఆ పిటిషన్ విచారణకు రానున్నట్లు భావిస్తున్నారు. బీఆర్ఎస్ రాజకీయంగా లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలను పసిగట్టిన బీజేపీ ఆ ఇష్యూని టేకప్ చేయాలని భావించింది. అందులో భాగంగా కనీస ఊహకు కూడా అందకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంటర్ అయ్యి నేరుగా గాంధీనగర్ వెళ్లి గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. వారికి దగ్గరయ్యేందుకు అప్పటికప్పుడు చలో సెక్రెటేరియట్ పిలుపు ఇచ్చి వారితో కలిసి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లేందుకు ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు.

దాదాపు రెండు గంటల పాటు అభ్యర్థులతో బండి సంజయ్ కలిసి ఉండడం, ర్యాలీ నిర్వహిస్తుండడాన్ని ప్రత్యక్షంగా చూసిన బీఆర్ఎస్ వెంటనే మెరుపు నిర్ణయం తీసుకుని పార్టీ నేతలను రంగంలోకి దించింది. అసలే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన పరిస్థితులను చక్కదిద్దుకోడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బీజేపీ పొలిటికల్ మైలేజ్ పొందుతుందనే అంచనాకు వచ్చి అప్పటికప్పుడు లీడర్లకు ఆదేశాలు జారీచేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాసగౌడ్, దాసోజు శ్రవణ్, స్థానిక ఎమ్మెల్యే (ముషీరాబాద్) ముఠాగోపాల్ తదితరులు రంగంలోకి దిగారు. అభ్యర్థులకు మద్దతు పలికి వారితో కలిసిపోయేందుకు ప్రయత్నించారు. అప్పటివరకూ బీఆర్ఎస్ ఈ విషయంలో పాల్గొనాలనే ప్లాన్ లేకపోయినా బీజేపీకి పోటీగా ఆకస్మిక నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు పొలిటికల్ కలర్ అంటుకున్నది. నాలుగు రోజులుగా గ్రూప్-1 అభ్యర్థులతో చర్చలు, సంప్రదింపులు జరుపుతూ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయించి సహకారం అందిస్తున్నా బండి సంజయ్ ఎంట్రీతో బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారిందని బీఆర్ఎస్ డైలమాలో పడింది.

రెండు పార్టీల మధ్య ఘర్షణ

పరిస్థితిని రాజకీయంగా అనుకూలంగా మల్చుకోవాలని భావించి సచివాలయం దగ్గర హడావిడి చేయాలని బీఆర్స్ భావించింది. కానీ పోలీసులు అప్పటికే భారీ స్థాయిలో అక్కడికి చేరుకోవడంతో బీఆర్‌కేఆర్ భవన్ దగ్గరే వారిని అడ్డుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. బండి సంజయ్‌కు అభ్యర్థులు ఇచ్చినంతటి మద్దతు బీఆర్ఎస్‌కు ఇవ్వకపోవడాన్ని ఆ పార్టీ నేతలు గ్రహించారు. దీంతో ఎంధుకొచ్చారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలతో బీజేపీ యాక్టివిస్టులు ఘర్షణకు దిగారు. రెండు పార్టీల శ్రేణుల మధ్య ముష్టిఘాతాలూ చోటుచేసుకున్నాయి. ఏదో ఒక హడావిడి చేసి సంచలనంగా నిలవాలని ప్రయత్నిస్తూ ఉన్న బీఆర్ఎస్ ఇపుడు గ్రూప్-1 అభ్యర్థుల అసంతృప్తి విషయంలో వెనకబడొద్దని భావించింది. ఒకవైపు హైకోర్టులో అభ్యర్థుల పిటిషన్లకు చుక్కెదురుకావడం, సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వారి డిమాండ్లకు ఆ రెండు పార్టీలు న్యాయం చేయడం సంగతి అలా ఉంచితే రాజకీయంగా పైచేయి సాధించడానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నిరసనల్లో పాల్గొనడం గమనార్హం.

గ్రూప్-1 మెయిన్స్ పై నేడు ప్రభుత్వ ప్రకటన

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ను రద్దు చేయాలని కొద్దిమంది అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్లపై మంత్రులు రివ్యూ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో సహచర మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు శనివారం సాయంత్రం పరిస్థితిని సమీక్షించారు. సచివాలయం దగ్గర జరిగిన నిరసనలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొని అరెస్టు కావడం, బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా ప్రయోజనం కోసం అభ్యర్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టడం.. వీటన్నింటిపై మంత్రులు, పీసీసీ చీఫ్ చర్చించారు. అభ్యర్థుల డిమాండ్లు, విజ్ఞప్తులు, అందులోని అనుకూల ప్రతికూల అంశాలను వీరు రివ్యూ చేశారు. ప్రభుత్వం తరఫున అధికారికంగా ఒక ప్రకటన చేయాలని ఈ సమావేశంలో మంత్రులు నిర్ణయానికి వచ్చారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, జీవో 29తో అందరికీ న్యాయం జరిగే అవకాశం, ఏ అభ్యర్థికీ నష్టం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రస్తుతానికి పరీక్షను యథాతథంగా నిర్వహించి అభ్యర్థుల సూచనలను పరిగణనలోకి తీసుకుని త్వరలో మరో గ్రూప్-1 నోటిఫికేషన్‌ను జారీ చేయడంపైనా ఆ ప్రకటనలో ప్రభుత్వ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.


Similar News