GHMC : ట్రేడ్ లైసెన్స్‌ల జారీలో జీహెచ్ఎంసీ సిబ్బంది చేతివాటం..

ట్రేడ్ లైసెన్స్‌ల జారీ జీహెచ్ఎంసీ సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తోంది.

Update: 2024-10-27 03:27 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : ట్రేడ్ లైసెన్స్‌ల జారీ జీహెచ్ఎంసీ సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ట్రేడ్ లైసెన్స్‌ల జారీ కోసం సర్కిళ్ల వారిగా అధికారులు స్పెషల్ డ్రైవ్ ( Special drive ) నిర్వహిస్తున్నారు. అధికారులు సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యాపార సంస్థలకు అనుమతి ఉందా ? లేదా ? అనేది పరిశీలించడంతో పాటు లైసెన్స్ విషయమై వ్యాపారులలో అవగాహన కల్పిస్తున్నారు. లైసెన్స్ తీసుకోని వారి విషయంలో చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. దీనిని కొంతమంది సిబ్బంది తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. లైసెన్స్ లేని వ్యాపారులను ఎస్‌ఎఫ్‌ఏలు, జవాన్లు కలిసి తాము లైసెన్స్‌లు ఇప్పిస్తామని పలురకాలుగా మభ్యపెడుతున్నారని తెలిసింది.

లైసెన్స్ తమ ద్వారా తీసుకుంటే తక్కువకు ఇప్పిస్తామంటూ ఎక్కువ మొత్తంలో వసూలు చేయడం, సంబంధిత అధికారుల వద్ద తాము ఎంత చెబితే అంత అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు కొంతమంది ఏఎంఓహెచ్‌ల దృష్టికి వచ్చింది. దీంతో వారు అప్రమత్తమై సిబ్బంది ఎవరైనా సరే అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించాల్సి రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. కొంతమంది వ్యాపారస్తులు కూడా జీహెచ్ఎంసీ సిబ్బందితో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దుకాణం ఉన్న ప్లేస్, విస్తీర్ణాన్ని తప్పుగా చూపించి లైసెన్స్‌లకు దరఖాస్తు చేయడం, వారికి సిబ్బంది సహకరించడం వంటివి చోటు చేసుకుంటుండడంతో వీటికి చెక్ పెట్టేందుకు గాను అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైతే..

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నార్మ్స్ (EODB) అమలు పై ఎంఏ అండ్ యూడీ 2017 జూన్ 22 నాటి జీఓ ఆర్టీ 459 ప్రకారం పునరుద్ధరణ ధరను చెల్లించిన తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఆటోమేటిక్‌గా పునరుద్ధరించబడుతుంది. లైసెన్స్ రుసుముతో పాటు, ట్రేడ్ లైసెన్స్ రుసుము రూ.5 వేల వరకు ఉన్న వ్యాపారాల పై 10 శాతం మొత్తాన్ని వసూలు చేస్తారు. మరోవైపు అంతకంటే ఎక్కువ ట్రేడ్ లైసెన్స్ రుసుము ఉన్న వారికి రూ.1000 జరిమాన విధిస్తారు. అన్ని ట్రేడ్‌లకు తెలంగాణ గ్రీన్ ఫండ్‌గా ప్రతి కొత్త లైసెన్స్ లేదా ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ ఉంటుంది. అయితే వ్యాపారులు రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైతే అదనంగా మరింత రుసుము చెల్లించాల్సి రావడం వారికి కాసులు కురిపిస్తోంది.

కలిసొచ్చిన దీపావళి..

మరో వారం రోజులలో దీపావళి పండుగ రావడం కూడా జీహెచ్ఎంసీ సిబ్బందికి వరంగా మారింది. గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేసే బాణసంచా దుకాణదారులు కూడా తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. రిటైల్ దుకాణాలకు రూ.11 వేలు, హోల్ సేల్ దుకాణాలకు రూ.66 వేలు లైసెన్స్ ఫీజు నిర్ణయించినట్లు కమిషనర్ ప్రకటించారు. దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారంతా నిర్ణీత ఫీజును చెల్లించి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని ప్రకటించారు. దీన్ని కూడా బల్దియా సిబ్బంది తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు..

వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్స్‌ల కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లైసెన్స్‌లు అవసరం ఉన్న వారు మధ్యవర్తులను నమ్మవద్దని, సీటీజెన్ సర్వీస్ సెంటర్‌లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందని, కిరాయిదారులైతే రెంటల్ అగ్రిమెంట్, యజమానులైతే ఎంత విస్తీర్ణం ఉందో ధృవీకరిస్తూ దరఖాస్తులు చేసుకోవాలి, ఇప్పటికే లైసెన్సులు కలిగి ఉండి గడువు ముగిసినవారు వీలైనంత త్వరగా రెన్యువల్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.


Similar News