బల్దియాలో ప్లానింగ్ మాఫియా

ఖైరతాబాద్ జోన్‌ జూబ్లీహిల్స్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2024-07-04 02:51 GMT

దిశ, సిటీబ్యూరో : ఖైరతాబాద్ జోన్‌ జూబ్లీహిల్స్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా జీహెచ్ఎంసీకి చెందిన 400 గజాల పార్క్ స్థలాన్ని కబ్జా చేసుకుని కొనసాగుతున్న బడా నిర్మాణ పనులను నిలిపేయాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు నిర్మాణదారుడికి వత్తాసు పలుకుతూ నిర్మాణ పనులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిర్మాణదారులిచ్చే లంచాల కోసం ఏకంగా పర్మిషన్లు లేని సైటులకు ఫేక్ పర్మిషన్లు సృష్టించి నిఘా వర్గాలను, ఇతర విభాగాల అధికారులను తప్పుదోవ పట్టించేందుకు సిద్దమయ్యారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

కమిషనర్ అడ్డుకున్నా..అధికారులు ఆపలేకపోయారు..

జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలోని రోడ్ నెం 86లో జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కనే లోటస్ పాండ్‌లోని పార్కు స్థలాన్ని జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి కబ్జా చేసేందుకు యత్నించాడు. పార్కు పక్కనే ఆయన ప్లాట్ ఉండడంతో పక్కనే ఉన్న పార్కు స్థలంలో చెట్లను నరికి చదును చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు సదరు నిర్మాణదారుడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినా, అప్పటికప్పుడు పనులు ఆగినట్టే ఆగి మళ్లీ జోరుగా కొనసాగుతున్నాయి. గతకొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసీ గోడను, దానికి ఉన్న గ్రిల్స్‌ను కూడా తొలగించి అందులో లారీలతో మట్టి పోయించి కబ్జాకు చేసేందుకు చేస్తున్న యత్నాన్ని ఈవీడీఎం కమిషనర్ అడ్డుకున్నా, అధికారులు మాత్రం కనీసం అక్కడ పనులను ఆపలేకపోయారు.

పర్మిషన్‌ రెన్యూవల్ చేయకుండానే..

పార్కు స్థలాన్ని కబ్జా చేస్తూ నిర్మాణం చేపట్టిన నైబర్ ల్యాండ్ యజమానికి తన స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు అనుమతి తీసుకున్నారని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లే ఫేక్ అనుమతులను సృష్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు యజమాని తీసుకున్న అనుమతి ప్రకారం 27 జూలై 2019కి ముందు నిర్మాణ పనులను చేపట్టి, 27 జనవరి 2024 నాటికి ముగించాల్సి ఉంది. అయితే పర్మిషన్ అమల్లో ఉన్నప్పుడు ఎలాంటి నిర్మాణాలు చేపట్టని సదరు యజమానికి గత సంవత్సరం సెప్టెంబర్‌లో పనులు కొనసాగిస్తున్న సమయంలో ఈ నిర్మాణంపై వరుసగా ఫిర్యాదులు రావడంతో ఈవీడీఎం కమిషనర్ గురువారం ఆగమేఘాలపై క్షేత్రస్థాయి పెళ్లి పనులను ఆపేశారు. అప్పటికప్పుడు పనులను ఆపినట్టు ఆపి, స్థానిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల అండతో పనులు యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు సమాచారం.

కానీ స్థానిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మాత్రం పనులను ఆపివేయించామని చెబుతుండటం వారు నిర్మాణ దారుడితో కుమ్మక్కయ్యారనేందుకు నిదర్శనం. ఈ నిర్మాణం పై అనుమానం వచ్చిన వారు సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రశ్నించినా, కాలం చెల్లిన పర్మిషన్ నెంబర్ చూపుతూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సదరు నిర్మాణ దారుడిని సమర్థించేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. పైగా ఆయన తీసుకున్న అనుమతి కాలం ముగిసినా, కోవిడ్ విపత్తు కారణంగా ఆయన పర్మిషన్‌కు ఏడాది కాలం మినహాయింపు కోసం ప్రధాన కార్యాలయంలో ప్రయత్నాలు చేస్తున్నారని సదరు సర్కిల్ ఏసీపీ సంపత్ చెప్పడం గమనార్హం.

పర్మిషన్‌లో అయోమయంగా వివరాలు..

ఈ నిర్మాణదారుడు చూపుతున్న పర్మిషన్‌లోని వివరాలన్ని అయోమయంగా ఉన్నాయి. వివరాలు ఇతరులకు తెలియకుండా ఉండేందుకు గాను సర్కిల్ 18లోని ఇన్‌కంట్యాక్స్ కాలనీలోని సైటు నిర్మాణ అనుమతుల ప్రొసీడింగ్ పై సర్కిల్ నెంబర్ తప్పుగా వేసి, నిర్మాణం పూర్తి చేయించేందుకు సిద్దమయ్యారు. సైటు సర్కిల్ 18లో ఉండగా, అనుమతి ప్రొసీడింగ్‌లో సర్కిల్ 19ని ముద్రించి ఫిర్యాదులనే గాక, ఉన్నతాధికారులను కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు లభ్యం కాకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు చీప్ ట్రిక్ ప్లే చేస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జూబ్లీహిల్స్ సర్కిల్‌లోని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒకరు ఈ నిర్మాణంలో వాటా దారుడిగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.


Similar News