డిప్యూటేషన్ అధికారుల గుప్పిట్లో జీహెచ్ఎంసీ

మహానగరంలోని కోటిన్నర మంది జనాభాకు అవసరమైన, అత్యవసరమైన సేవలందించే జీహెచ్ఎంసీ ఆర్థికంగా మోయలేని భారాన్ని మోస్తుంది...

Update: 2024-08-03 02:10 GMT

దిశ, సిటీబ్యూరో: మహానగరంలోని కోటిన్నర మంది జనాభాకు అవసరమైన, అత్యవసరమైన సేవలందించే జీహెచ్ఎంసీ ఆర్థికంగా మోయలేని భారాన్ని మోస్తుంది. దీనికి తోడు డిప్యూటేషన్లు, సీడీఎంఏ, ఎంఏయూడీ శాఖల నుంచి అధికారులు వరదలా వస్తుండటంతో బల్దియా పరిస్థితి మూలుగుతున్న నక్కపై తాటికాయ పడినట్టయింది. బల్దియా జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందిన తర్వాత సీడీఎంఏ, ఎంఏయూడీల ఆధిపత్యమే కొనసాగుతుందన్న వాదనలున్నాయి. అత్యవసరమైన సేవలతో పాటు పరిపాలనాపరమైన విధులు ప్రైవేటుపరం చేస్తూ బల్దియా ఆర్థికభారం తగ్గించుకుంటున్నా, అడ్డదారిలో తిష్టవేసిన డిప్యూటేషన్, రిటైర్డు అధికారుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో (2013-14) ఆర్థిక సంవత్సరం రూ.వెయ్యి కోట్ల ఆస్తి పన్ను వసూలుతో గలగలాడిన ఖజానా ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయింది. దీంతో రొటీన్ మెయింటనెన్స్ గగనంగా మారినట్లు సమాచారం. ఒక్కోసారి నెల జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు మరుసటి నెల 15వ తేదీ వరకు సమయం పడుతుందంటే సంక్షోభం ఏస్థాయిలో ఉందో అంచనా వేసుకోవచ్చు. కార్పొరేషన్ ఉద్యోగులు వివిధ మార్గాల్లో జీహెచ్ఎంసీ ఖజానా నింపుతుంటే, డిప్యూటేషన్లపై వచ్చిన అధికారులు ఖజానాకు కన్నం వేస్తున్నట్లు పర్మినెంట్ ఉద్యోగులు మండిపడుతున్నారు.

సీడీఎంఏ, ఎంఏయూడీ విభాగాల నుంచే గాక, ఇతర శాఖల నుంచి అధికారుల వలస వరదలా రావటంతో ఏడు అంతస్తుల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఛాంబర్లు కూడా సరిపోవటం లేదు. వచ్చిన వారంతా తమకు నచ్చిన విధంగా తమ ఛాంబర్‌ను కార్పొరేట్ స్టైల్‌లో ఆధునీకరించుకోవటం కూడా అదనపు భారంగా మారుతుంది. కొత్త సర్కారు హయాంలోనైనా పరిస్థితులు ఏమైనా మారుతాయెమోనని ఆశించినా అధికారుల అంచనాలన్నీ తారుమారయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ఇప్పటి వరకు రూ.5 వేల కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్, రూ.2,980 కోట్ల స్టాంప్స్, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఛార్జీలు బకాయిపడ్డా, ఆ ప్రస్తావన తేకుండానే ఇటీవలి బడ్జెట్‌లో కేవలం రూ.3,065 కోట్లను కేటాయించటం చర్చనీయాంశంగా మారింది. పైగా డిప్యూటేషన్లపై వచ్చిన అధికారులను, రిటైర్ అయిన తర్వాత కొనసాగుతున్న వారిని వెనక్కి పంపించాలని నివేదికలు పంపిన నేపథ్యంలో సర్కారు ఇటీవల చేపట్టిన బదిలీల ఆదేశాలు కూడా బల్దియాలో అంతంతమాత్రంగానే అమలయ్యాయన్న విమర్శలున్నాయి.

ప్రైవేటీకరణ వైపు మొగ్గు..

ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేని బల్ది్యా సేవలను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే శానిటేషన్‌లోని చెత్త కలెక్షన్, ట్రాన్స్‌పోర్ట్ రాంకీ ఎన్విరో సంస్థకు ఒప్పందం చేసుకుని, అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నగరంలోని మెయిన్ రోడ్ల నిర్వహణను సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) కింద ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించిన సంగతి తెలిసిందే. కానీ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సంస్థల్లో జవాబుదారితనం కొరవడటంతో మళ్లీ కార్పొరేషన్ ఉద్యోగులే మరమ్మతులు చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై ఇటీవలే జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీవ్రస్థాయిలో దుమారం కూడా రేగింది. మెరుగైన నిర్వహణ పేరుతో పలు రకాల సేవలకు సంబంధించిన విధులను తగ్గించుకుంటున్నా, ప్రతినెల పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నా, ఇతర శాఖల నుంచి వచ్చే అధికారుల సంఖ్యను మాత్రం తగ్గించుకోకపోవటమే ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణమన్న వాదనలున్నాయి.

సంపాదన కోసం విదేశాలకు వెళ్లిన మాదిరిగా జీహెచ్ఎంసీ అందించే సేవలకు ఏమాత్రం సంబంధం లేకున్నా, అక్రమార్జన కోసం పైరవీలు చేసుకుని జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్ పై వస్తున్నట్లు పలు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీహెచ్ఎంసీలో విధులు నిర్వర్తించకముందు, నిర్వహిస్తున్నప్పుడు, నిర్వహించి వెళ్లిన తర్వాత వారి ఆస్తులను లెక్కకడితే ఈ విషయం బయటపడుతుందని, సర్కారు రాష్ట్ర మున్సిపల్ శాఖపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలంటూ పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

డిప్యూటేషన్లతోనే అధిక ఆర్థిక భారం..

కార్పొరేషన్ సొంత ఉద్యోగులకన్నా, డిప్యూటేషన్ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వారికి లక్షల్లో జీతాలు, కారు, ఛాంబర్ ఇతరత్ర సౌకర్యాల కల్పన ఆర్థిక సంక్షోభంలో జీహెచ్ఎంసీ పెనుభారంగా మారుతుంది. మరో వైపేమో కార్పొరేషన్‌కు చెందిన పర్మినెంట్ ఉద్యోగులు ప్రతినెల పదుల సంఖ్యలో పదవీ విరమణలు పొందుతూ ప్రస్తుతం వారి సంఖ్య మూడున్నర వేలకు పడిపోయింది. కానీ కోటికి పైచిలుకు నగరవాసులకు రకరకాల సేవలనందించేందుకు కనీసం రూ.70 వేల నుంచి రూ.80 వేల మంది సిబ్బంది అవసరం కాగా, జీహెచ్ఎంసీలో పర్మినెంట్ మూడున్నర వేల మంది, ఔట్‌సోర్స్, కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 30 వేల నుంచి 31 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో పర్మినెంట్ ఉద్యోగులు మినహా మిగిలిన వారికి రూ.20 వేలలోపే జీతాలుంటాయి. వీరంతా ఫోర్త్, థర్డ్ క్లాసులకు చెందిన వారే ఉన్నట్లు సమాచారం. రూ.20 వేల పైచిలుకు జీతాలు దాదాపు రెండున్నర వేల మందికున్నాయి. ఇది మించి వారికెలాంటి ప్రయోజనాల్లేవు. కానీ ఇతర శాఖల నుంచి జీహెచ్ఎంసీకి డిప్యూటేషన్ పై వచ్చే అధికారులకు జీతాలు లక్షల్లో, కారు, ఛాంబర్, సెల్‌ఫోన్ ఇతర సౌకర్యాలను కల్పించటం జీహెచ్ఎంసీకి గగనంగా మారింది. అన్ని రకాల సౌకర్యాలు కల్పించినా, కనీసం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అంటే అదీలేదంటూ విమర్శలున్నాయి.

పర్మినెంట్ ఉద్యోగులతోనే ఆదాయం..

జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరమైన ప్రాపర్టీ ట్యాక్స్‌ను 300 మంది బిల్ కలెక్టర్లు, 150 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు వసూళ్లు చేస్తున్నారు. నగరంలోని 30 సర్కిళ్లల్లో క్షేత్రస్థాయిలో వీరే ట్యాక్స్ వసూలు చేసి ఖజానా నింపుతుంటే, అవసరంలేని, అర్థరహితమైన ప్రతిపాదనలు తయారు చేస్తూ ఇతర శాఖల నుంచి వచ్చిన అధికారులు ఖజానాకు కన్నం వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పన్ను వసూలుకు ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్ నుంచి మార్చి వరకు 12 నెలల సమయమున్నా, ఎక్కువగా వసూళ్లపై దృష్టిపెట్టేది కేవలం జనవరి నుంచి మార్చి వరకే. మిగిలిన రోజుల్లో కనిష్టంగా రోజుకి రూ.30 లక్షలు, గరిష్టంగా రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పన్ను వసూలవుతుంది. జనవరి నుంచి మార్చి వరకు ఒక్కో రోజు ఏకంగా రూ.వంద కోట్ల వరకు వసూలైన సందర్భాలున్నాయి. బల్దియాకు నిధులను సమకూర్చటంలో ట్యాక్స్ విభాగంలోని పర్మినెంట్ ఉద్యోగులు, టౌన్ ప్లానింగ్‌లోని డీటీసీపీ ఉద్యోగులే విధులు నిర్వహిస్తుంటారే తప్పా, మిగిలిన విభాగాల్లోకి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులంతా నిధులను ఖర్చు చేసే పనిలో నిమగ్నమై ఉంటారంటూ పర్మినెంట్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News