ఉచితంగా ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సు

నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా

Update: 2024-10-16 15:33 GMT

దిశ, రవీంద్రభారతి : నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సు నిర్వహిస్తున్నామని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ కార్యాలయంలో బుధవారం " రెండవ బ్యాచ్" ఉచిత ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సు వాల్ పోస్టర్ ను అకాడమీ చైర్మన్ ఎం.సి.శేఖర్, కే.జనార్దన్ లతో కలిసి డా.మామిడి హరికృష్ణ ప్రచార గోడ పత్రికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత ఫోటోగ్రఫీ నేర్చుకోవడం పట్ల ఉత్సాహంగా ఉన్నట్లయితే, వారు ఈ సమగ్ర ఉచిత ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సును పూర్తి చేసిన తర్వాత ఉపాధి పొందవచ్చునని తెలిపారు.

ఎం.సి.శేఖర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఫోటోగ్రఫీ తోపాటు పిక్టోరియల్ షూటింగ్ నైపుణ్యాలను, అధునాతన సాంకేతికతలు, కాంపొజిషన్, లైటింగ్, ఫ్రేమింగ్ లలో కలిగిన అధ్యాపకులచే శిక్షణ ఇవ్వబడుతుందని, ఈ ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్స్ ఫోటోగ్రఫీ పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో పట్టణ, గ్రామీణ యువతకు సహాయం చేయడమే కాకుండా ఫోటోగ్రాఫర్‌గా ఎదిగి, వృత్తిగా స్వీకరించేవారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ రెండవ బ్యాచు ఉచిత ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సు వచ్చే నెల నవంబర్ 14 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు https://sapindia.org/free-workshops/ లింక్ ద్వారా చేసుకోవాలని, ఆఖరు తేదీ అక్టోబర్ 31, 2024 అని ఎం.సి.శేఖర్ వెల్లడించారు.


Similar News