మల్టీ పర్పస్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులకు శంకుస్థాపన..

Update: 2023-08-06 10:04 GMT

దిశ, చార్మినార్: అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్‌లలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. స్థానిక సంస్కృతి, వారసత్వం నిర్మాణానికి అనుగుణంగా ఆయా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌కి రూ.26.81 కోట్ల నిధులతో పునరాభివృద్ధికి పద్మశ్రీ అవార్డు గ్రహిత కిన్నెర మోగిలయ్య, కార్పొరేటర్లు ఆలే భాగ్యలక్ష్మి, శ్వేతా మదుకర్ రెడ్డి లు శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పాతబస్తీకి అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఉప్పుగూడ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నటుడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో పాటపాడినందుకు తనను ప్రభుత్వం గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ అనురాధ, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ ట్రాక్షన్ శ్రీతేజ, ప్రతాప్, మాజీ కార్పొరేటర్ ఆలే జితేంద్ర, రూప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News