మాజీ మంత్రి కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు
మూసీ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ శ్రేణుల నుండి నిరసన ఎదురైంది
దిశ, హైదరాబాద్ బ్యూరో : మూసీ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ శ్రేణుల నుండి నిరసన ఎదురైంది. శంకర్ నగర్ లో మూసీ రివర్ బెడ్ నిర్వాసితులను పరామర్శించేందుకు కేటీఆర్ మంగళవారం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్ ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. కేటీఆర్ గో బ్యాంక్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకు ముందు గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు.
ఆపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, బీఆర్‌ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు బాహాబాహికి దిగాయి. అనంతరం అంబర్‌పేట గోల్నాక పరిధిలోని తులసీరామ్ నగర్ వెళ్లిన కేటీఆర్ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మూసీ నది ఇతర ప్రాంతాలలో కూల్చివేతల ప్రదేశాలకు వెళ్లి బాధితుల గోడును విన్నారు. అంబర్ పేట, గోల్నాక, తులసీ నగర్ ప్రాంతాలలో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా కేటీఆర్ కాన్వాయ్ పై దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు.