ఆదాయంపై జీహెచ్ఎంసీ అశ్రద్ధ.. రూ. వేల కోట్లలో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు

అభివృద్ధి, పౌర సేవల నిర్వహణ, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులు వంటి విషయాలను ప్రస్తావిస్తే నిధులు లేవంటూ గట్టిగా సమాధానం చెబుతున్న జీహెచ్ఎంసీ అధికారులు సర్కారు నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు తెప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Update: 2024-07-10 03:32 GMT

దిశ, సిటీబ్యూరో : అభివృద్ధి, పౌర సేవల నిర్వహణ, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులు వంటి విషయాలను ప్రస్తావిస్తే నిధులు లేవంటూ గట్టిగా సమాధానం చెబుతున్న జీహెచ్ఎంసీ అధికారులు సర్కారు నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు తెప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి సర్కారుకు వచ్చే స్టాంప్, రిజిస్ట్రేషన్ నిధుల్లో నుంచి జీహెచ్ఎంసీకి మ్యుటేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. కానీ 2021 నుంచి గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సుమారు రూ.175 కోట్ల మ్యుటేషన్ ఛార్జీలను గత కమిషనర్ రోనాల్డ్ రోస్ డైరెక్టర్ ఆఫ్ స్టాంట్, రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాయడంతో రూ.39 కోట్ల నిధులను ఆ శాఖ అప్పట్లో బదిలీ చేసింది.

అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి శానిటేషన్ పై ప్రత్యేక దృష్టిసారించారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా రెండు, మూడు రోజుల పాటు ఉదయాన్నే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ సిబ్బందిని హడలెత్తించిన ఆమె ఆ తర్వాత సైలెంట్‌గా సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. గతంలో కూడా జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ ఆర్థిక స్థితిగతులపై బాగానే పట్టున్నప్పటికీ, ఆమె సర్కారు నుంచి జీహెచ్ఎంసీకి రావల్సిన నిధులను రాబట్టుకునేందుకు ఎందుకు లేఖ రాయడం లేదన్నది హాట్‌టాపిక్‌గా మారింది.

ఇంకెంత కాలం ఖాళీ..

జీహెచ్ఎంసీకి చెందిన ఆస్తుల్లో వందలాది సంఖ్యలో షాపులు, మలిగీలు, కొత్తగా నిర్మించిన మార్కెట్లలో స్టాళ్లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. వీటిని అద్దెకు ఇస్తే జీహెచ్ఎంసీకి నెలసరిగా ఆదాయం సమకూరుతుంది. కనిష్టంగా రూ.వంద, గరిష్టంగా రూ.80 వేల నుంచి లక్ష రూపాయల అద్దె వచ్చే మలిగీలు, షాపులను సైతం అద్దెకు ఇవ్వకుండా ఏళ్ల నుంచి ఖాళీగా ఉంచారు. ఇటీవలే ఎస్టేట్ విభాగంపై మేయర్ విజయలక్ష్మి సమీక్ష నిర్వహించి అస్తుల వివరాలన్ని సమర్పించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. నారాయణగూడలో శానిటేషన్ పనులను తనిఖీ చేస్తూ నిర్మించి, వదిలేసిన చిక్కడపల్లి మార్కెట్‌ను చూసిన ఆమ్రపాలి అందులో ఖాళీగా ఉన్న స్టాళ్లకు వేలం పాట నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి వారం రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

పైగా ఎస్టేట్ విభాగంలోని ఆస్తుల వివరాలన్ని డిజిటలైజేషన్ చేయాలన్న ప్రయత్నం గతంలోనే మొదలైనప్పటికీ, దాన్ని ముందుకు సాగనివ్వడం లేదని సమాచారం. కొందరు అక్రమార్కులైన ఎస్టేట్ ఆఫీసర్లు వందల సంఖ్యలో షాపులు, మలిగీలను కాగితాలపై ఖాళీ అని చూపుతూ అద్దెలకిచ్చి, అద్దెలను జీహెచ్ఎంసీ ఖజానాలో జమ చేయకుండా జేబులు నింపుకున్నట్లు ఆరోపణలున్నాయి. సికింద్రాబాద్‌లో ఓ ఎస్టేట్ ఆఫీసర్ ఏకంగా రూ.30 లక్షలను జేబులు నింపుకున్న వ్యవహారం బయటపడగానే ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఓ అధికారిని నియమించగా సదరు అధికారి సైతం రూ.30 లక్షల్లో కొంత వసూలు చేసుకుని, విచారణను పక్కన పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఖాళీ షాపులు, మలిగీలను మార్కెట్ విలువ ప్రకారం వేలం నిర్వహించి అద్దెకిస్తే జీహెచ్ఎంసీకి చాలా వరకు నిధులు సమకూరే అవకాశమున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సర్కారు ఆస్తి పన్ను బకాయిలు రూ.వేల కోట్లలో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భవనాల ఆస్తి పన్ను బకాయిలు సుమారు రూ.2 వేల కోట్ల పైచిలుకు ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ అధికారులు సర్కారును ధైర్యం చేసి పన్ను చెల్లించాలంటూ ప్రశ్నించ కపోవడంతో ఇప్పుడు ఆ బకాయిలు రూ.2 వేల కోట్ల పైచిలుకు పేరుకు పోయినట్టు సమాచారం. ఈ బకాయిల్లో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు కొద్ది నెలల పాటు నెలకు రూ.29 కోట్ల చొప్పున కొద్ది నెలలు మాత్రమే చెల్లించినట్లు సమాచారం.

 


Similar News