భానుడి భగభగ.. బడులకు వెళ్ళేదెలాగా.. !

భానుడి భగభగలు తగ్గడం లేదు. జూన్ నెల సుమారు సగభాగం గడిచినా ఎండలు తీవ్రంగానే ఉన్నాయి.

Update: 2023-06-12 13:40 GMT

దిశ, మెహిదీపట్నం : భానుడి భగభగలు తగ్గడం లేదు. జూన్ నెల సుమారు సగభాగం గడిచినా ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. సోమవారం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే ఎండల వేడిమి ఇంకా తగ్గకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి రోజు సోమవారం ఆయా పాఠశాలలకు సుమారు 40 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. సోమవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

ఉదయం 8 నుంచి భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం 6 వరకు కూడా ఎండలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజులు సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎండలు బాగా ఉండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెలుగు గోల్కొండ ఉన్నత పాఠశాలలో, లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ లోని అంబేద్కర్ ఉన్నత, ప్రైమరీ పాఠశాలలో సుమారు 40 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తెలియజేశారు.

Tags:    

Similar News