పాశ్చాత్య వ్యామోహంతో భారతీయ మూలాల్ని విస్మరించొద్దు : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పాశ్చాత్య వ్యామోహంతో భారతీయ మూలాల్ని విస్మరించవద్దని, లోపాల్ని సరిచేసుకుంటూ భారతీయ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందనీ, సామాజిక వాస్తవాలకు దర్పణంగా రేవు తిరగబడితే ఉందని భారత మాజీ రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
దిశ, శేరిలింగంపల్లి : పాశ్చాత్య వ్యామోహంతో భారతీయ మూలాల్ని విస్మరించవద్దని, లోపాల్ని సరిచేసుకుంటూ భారతీయ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందనీ, సామాజిక వాస్తవాలకు దర్పణంగా రేవు తిరగబడితే ఉందని భారత మాజీ రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత, ఆదివాసీ అధ్యయనం, అనువాద కేంద్రంలో (సిడాస్ట్) జరిగిన కార్యక్రమంలో ఆచార్య పులికొండ సుబ్బాచారి రచించిన రేవు తిరగబడితే నవలను ఆయన ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. స్వరాజ్యం సముపార్జించిన తొలినాళ్ళలో ఇంకా స్వాతంత్య్రం రాని ప్రజల స్థితిగతులను ఈ నవల ప్రతిఫలిస్తుందని ఆయన అన్నారు. సాంఘిక సమానత్వంతో పాటు, ఆర్థిక పరిస్థితులు కూడా అందరికీ అందుబాటులో రావాలన్నారు.
ఎంతో పరిశోధన చేసి ఈ నవల అందించిన ఆచార్య పులికొండ సుబ్బాచారిని ప్రశంసించారు. ఈ సమావేశానికి హెచ్సీయూ వైస్-ఛాన్సలర్ ఆచార్య బి.జె.రావు అధ్యక్షత వహించారు. వివిధ కుల వృత్తుల వారు వారి మానసిక సంఘర్షణలను ఈ నవలలో రచయిత ఆచార్య పులికొండ సుబ్బాచారి శక్తివంతంగా వివరించారని ఆచార్య బీజేరావు అన్నారు. అతిథులుగా హెచ్సీయూ ప్రొ. వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్.ఎస్.సర్రాజు, ఆంధ్రజ్యోతి సంపాదకులు డా.కె.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు నవలా సాహిత్యంలో మాలపల్లి తర్వాత మరల అటువంటి ఉత్తమ నవల అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా.మామిడి హరికృష్ణ, ప్రముఖ కవి డా.కొప్పర్తి వెంకట రమణమూర్తి పాల్గొనగా, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ప్రభుత్వ సిటీ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డా.కోయికోటేశ్వరరావు పుస్తక సమీక్ష చేశారు. నవలలో సమకాలీన బహుజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన పరిణామాలు, దాని వెనుక సుమారు ఏభై యేళ్ల సంఘర్షణను, ఆ చారిత్రక వాస్తవాలను తెలుసుకోవచ్చునని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు.
తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక రజక స్త్రీ చాకలి ఐలమ్మ సూత్రధారి అయితే, ఈ నవలలో బహుజనల ఆత్మగౌరవ పోరాటానికి బొర్రమ్మ కేంద్రమవుతుందని ఆచార్య దార్ల అన్నారు. తెలంగాణ ప్రాంతంలో రజాకార్ల దురాగతాలు, దేశ స్వాతంత్య్రం, తదనంతరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పటేలు, కరణం, గ్రామ పెత్తందారుల చేతుల్లో చేతివృత్తుల వాళ్లు ఎన్ని కష్టాలను అనుభవించవలసి వచ్చిందో ఈ కథలో ఆ చారిత్రక వాస్తవాలను చక్కగా రచయిత సృజనీకరించారని విశ్లేషించారు. ఆత్మగౌరవం, అస్తిత్వం , బహుజన కులాల ఐక్యత అనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దృష్టితో రచయిత ఈ నవలను రచించారని డాక్టర్ కోయి కోటేశ్వరరావు అన్నారు. దళిత బహుజనులు ఎదుర్కొంటున్న ఆకలి, అవమానాల ఉమ్మడి తీవ్రతను, సామాజిక ఆర్థిక దోపిడీని ఈ నవల ద్వారా రచయిత వివరించారని అన్నారు. సిడాస్ట్ అధ్యక్షులు ఆచార్య విష్ణు సర్వదే సమావేశానికి అతిథులను ఆహ్వానించగా, ఆచార్య పులికొండ సుబ్బాచారి తాను రచించిన నవల నేపథ్యాన్ని వివరించారు.