కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి.
దిశ, శేరిలింగంపల్లి : ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. పొద్దుట ఒక పార్టీ కండువా కప్పుకుంటున్న నేతలు, సాయంత్రానికి మరోపార్టీలో జాయిన్ అవుతున్నారు. పార్టీ కోసం ఇన్నాళ్లు పనిచేసిన నేతలు, భారీగా ఖర్చు పెట్టుకున్న నాయకులు టికెట్ రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు టికెట్ దక్కించుకున్న నాయకుల నుండి కూడా సరైన గౌరవం లభించకపోవడం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. భారీగా డబ్బులు ఖర్చుపెట్టి పార్టీ కోసం కష్టపడితే హస్తం పార్టీలో చివరకు రిక్తహస్తాలే మిగిలాయని మండిపడుతున్నారు. గౌరవం లేనిచోట ఉండడం కంటే గుర్తింపు ఉన్నవైపు వెల్లడమే మంచిదని ఆయా నేతల సన్నిహితులు, ఆత్మీయులు సలహాలు ఇస్తున్నారట. ఆ దిశగా కాంగ్రెస్ కు చెందిన ఆ ఇద్దరు నాయకులతో పాటు వారి సన్నిహితులతో కలిసి త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి..
రాష్ట్రవ్యాప్తంగా మంచి ఊపుమీద కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాత్రం చాలావరకు అసంతృప్తి కనిపిస్తుంది. కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆపార్టీ సీనియర్ నాయకుడు, పీజేఆర్ అనుచరుడు జెరిపేటి జైపాల్ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీని కష్టకాలంలోనూ నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించాడు. పార్టీ పిలుపు ఇచ్చిన అన్ని కార్యక్రమాల విజయవంతానికి తీవ్రంగా కృషిచేస్తూ వచ్చారు. టికెట్ తనకే వస్తుందన్న ఉద్దేశ్యంతో తీవ్రంగా శ్రమించారు. కానీ బీఆర్ఎస్ నుండి వచ్చిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ టికెట్ దక్కించుకోవడంతో తీవ్రనిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన స్థబ్దుగా ఉన్నారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం పక్కాకావడంతో జెరిపేటి జైపాల్ కూడ అదేబాటలో నడిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
రఘునాథ్ యాదవ్ దారెటు..!
బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి పదవికి రాజీనామా చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మారబోయిన రఘునాథ్ యాదవ్ శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం నింపారు. భారీగా చేరికలు చేయించి ఏదో ఈ కార్యక్రమంతో పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లారు. పెద్దఎత్తున ఖర్చు చేసి ఆయా డివిజన్లలో పాదయాత్రలు చేశారు. ఒకానొక దశలో రఘునాథ్ యాదవ్ కే శేరిలింగంపల్లి టికెట్ వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. పొంగులేటితో కలిసి పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన రఘునాథ్ యాదవ్ కోసం అధిష్టానాన్ని ఒప్పించి శేరిలింగంపల్లి టికెట్ ఇప్పిస్తారనే నమ్మకాని వ్యక్తం చేశారు. తీరా ఆయన ఆశలు అడియాసలయ్యాయి. దీంతో ఇప్పుడు ఆయన దారెటు అన్నది తేలాల్సి ఉంది. అయితే త్వరలోనే తన అనుచరులతో కలిసి మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహితులు ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దీంతో రఘునాథ్ యాదవ్ కూడా కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదా అనేది త్వరలోనే తేలనుంది.
కలుపుకుపోతారా.. ఒంటరిగా వెళ్తారా..?
కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆపార్టీ అధిష్టానం పంపిన రాయబారులు సక్సెస్ కాలేక పోయారు. మాజీ ఎంపీ మల్లురవి జెరిపేటి జైపాల్ ఇంటికి వచ్చి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ జెరిపేటి వెనక్కి తగ్గలేదని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఆదివారం పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిసిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన జైపాల్ కుమారుడు ఆ ఫోటోపై పెట్టిన సానుకూల పోస్ట్ జెరిపేటి జైపాల్ కూడా బీఆర్ఎస్ లో చేరుతారేమో అన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక రఘునాథ్ యాదవ్ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ వీరందరిని కలుపుకు పోతారా..? లేదా.. పోతే పోనీలే అన్నట్టుగా వ్యవహరిస్తారా అన్నది చూడాలి.