బీఆర్ఎస్ పార్టీలో టికెట్ పై ఎవరి ధీమా వారిదే..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతల్లో టికెట్ పై రచ్చ రచ్చ, చర్చోప చర్చలు జరుగుతున్నాయి.

Update: 2023-05-15 15:04 GMT

దిశ, ముషీరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతల్లో టికెట్ పై రచ్చ రచ్చ, చర్చోప చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలతో పాటు పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు నియోజకవర్గంలోని మాజీ కార్పొరేటర్లకు, ఉద్యమకారులకు ఆహ్వానం రాకపోవడంతో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ కార్పొరేటర్లు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సమావేశాల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి.

భజనలు చేస్తేనో, నినాదాలు చేస్తేనో టికెట్ రాదని, టికెట్ అనేది వారసత్వం కాదని, కష్టపడితే ఎవరికైనా వస్తుందని ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ పై ఈ ఆత్మీయ సమ్మేళనాలల్లో బహిరంగంగానే మాజీ కార్పొరేటర్, నాయిని అల్లుడు వి.శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీని పై పార్టీలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ముఠా గోపాల్ కె టికెట్ అని, కాదు.... కాదు శ్రీనివాస్ రెడ్డికే టికెట్ అని వారివారి అనుచరులు తెగ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో యువకుడు, దుందుడుకుగా ఉంటాడని శ్రీనివాస్ రెడ్డి పై పార్టీ అధిష్టానం అనకుంటున్నట్లు తెలిసింది. ముఠా గోపాల్ కు పార్టీ అధిష్టానం మళ్లీ టికెట్ ఇస్తదా, లేదా వి.శ్రీనివాస్ రెడ్డికి ఇస్తదా అని వేచి చూడాల్సిందే.

మళ్లీ ముఠాకే టికెట్ ?

రాబోయే ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్లి ముఠా గోపాల్ కే టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో గంగపుత్ర కులానికి చెందిన ఎమ్మెల్యేగా ముఠాగోపాల్ ఒక్కరే ఉన్నారు. కుల ప్రాతిపదికన మళ్లీ ఆయనకే టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వివాదాల జోలికి వెళ్లకపోవడం నియోజకవర్గంలో ప్రస్తుతం ముఠాగోపాల్ కె అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశాల్లో సిట్టింగ్లకే టికెట్ ఇస్తామని ప్రకటించి ఉన్నారు. దానికితోడు ముఠాగోపాల్ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ వస్తున్నారు. వయస్సు పై బడిన సమస్య ఉన్నప్పటికి ముఠా గోపాల్ మాత్రం లెక్కచేయకుండా నిత్యం బస్తీల్లో పర్యటిస్తూ, అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయిస్తూ శంకుస్థాపనలు చేస్తున్నారు.

నియోజకవర్గంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో వీడీసీసీ రోడ్లను వేయించారు. భోలక్‌పూర్‌ డివిజన్ లో ఉన్న కలుషిత నీటి సమస్య పరిష్కారం ముఠా గోపాల్ 25 కోట్ల రూపాయలను మంజూరు చేయించి నూతన డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్లను వేయించారు. నాయిని నర్సింహారెడ్డి హోంమంత్రిగా ఉండి ప్రత్యేక చొవర చూపి మంజూరు చేయించిన ఇందిరాపార్క్ నుంచి నాగమయ్యకుంట వరకు రూ. 426 కోట్లతో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే గోపాల్ మరింత వేగమయ్యేలా కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ముఠాగోపాల్ చేస్తున్న పనులను చూస్తే మళ్లీ తిరిగి ఆయనకే టికెట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే ముఠా గోపాల్ తనకు అయినా, తన కుమారుడు ముఠా జైసింహకు అయిన టికెట్ ఇవ్వమని అధిష్టానాన్ని పలుమార్లు కోరినట్లు తెలిసింది.

ముషీరాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ముఠా గోపాల్ ఉన్నారు. అయితే అదే పార్టీకి చెందిన నాయకుడు, తొలి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు, రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. వాస్తవానికి 2014 లోనే నాయిని నర్సింహారెడ్డి తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు కేసీఆర్ వద్ద తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం ముఠా గోపాల్ వైపు మొగ్గు చూపారు. దీంతో 2014 లో శ్రీనివాస్ రెడ్డికి టికెట్ రాలేదు. మళ్లి 2018 లో జరిగిన ఎన్నికల సమయంలో టికెట్ కోసం శ్రీనివాస్ రెడ్డి తన మామ నాయిని నర్సింహారెడ్డితో తీవ్రప్రయత్నాలు చేశారు. కానీ శ్రీనివాస్ రెడ్డి ఆ సమయంలో రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ గా ఉండడం ఆయనకు ప్రతికూలంగా మారింది.

అదే సమయంలో సీఎం కేసీఆర్ తనఫామ్ హౌస్ కు అప్పటి హోంమంత్రి నాయినితో పాటు శ్రీనివాస్ రెడ్డిని కూడా పిలుపించుకుని తప్పకుండా న్యాయం చేస్తానని, నేనున్నానని కేసీఆర్ భరోసా ఇచ్చారని శ్రీనివాస్ రెడ్డే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పకున్నారు. దానికి తోడు ముఠా గోపాల్ గట్టిగా టికెట్ కోసం పట్టుబడడంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మళ్లీ ముఠాగోపాల్ కే టికెట్ ఇచ్చింది. ఆ తర్వాత నాయిని నర్సింహారెడ్డి కరోనా సమయంలో అనారోగ్యరీత్యా చనిపోవడంతో శ్రీనివాస్ రెడ్డి నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి తన భార్య సమతా రెడ్డిని, నాయిని కొడుకు నాయిని దేవేందర్ రెడ్డిలతో కలిసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. రాంనగర్ డివిజన్ తో పాటు నియోజకవర్గం మరో ఒకటి, రెండు డివిజన్లల్లో తన అనుచరులు నిర్వహించే కార్యక్రమాలకు వెళ్తున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ను శ్రీనివాస్ రెడ్డి పలుమార్లు కలిశారు. ఆ సందర్భంలో కూడా శ్రీను నీకు, నాకు ఒకేసారి టైమ్ రాబోతుందని అని హింట్ ఇచ్చినట్లు తెలిసింది.

Also Read..

బీజేపీలో ఆగని వర్గపోరు.. కమలంలో కల్లోలం 

Tags:    

Similar News