‘ఆబాదీ’ పేరుతో అవకతవకలు.. లే అవుట్లుగా మారిన లక్షల ఎకరాలు

‘ఆబాదీ’ విస్తరణకు డిమాండ్లు పెరుగుతున్నాయి....

Update: 2024-12-27 02:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వందేళ్ల క్రితం గుర్తించిన గ్రామకంఠానికి, ప్రస్తుత గ్రామ కంఠానికి చాలా వ్యత్యాసం ఉంది. పట్టణాలు, గ్రామాలు నాలుగింతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ‘ఆబాదీ’ని విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్వోఆర్-2024 రూల్స్ ఫ్రేం చేసేటప్పుడు ప్లాట్లుగా మారిన పూర్తి స్థలాన్ని ఆబాదీగా పరిగణించేట్లుగా మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. కాగా, భూభారతిలో వ్యవసాయం, వ్యవసాయేతర ఆస్తులతో పాటు ఆబాదీకి సైతం ప్రత్యేక రికార్డు నిర్వహించనున్నారు. నాలా కన్వర్షన్ చేయకుండా ప్లాట్లు చేసి అమ్మిన భూమి లక్షల ఎకరాల్లో ఉండగా.. ఆబాదీ విస్తరణలో ఇల్లీగల్ అగ్రికల్చర్ ల్యాండ్ డిటెయిల్స్ బయటికొస్తాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం లే అవుట్లకు అనుమతులు నిరాకరించినా మరో 40 ఏండ్లకు సరిపడా ప్లాట్లు ఉన్నాయని, అంతకు మించిన కాలానికి కూడా పూర్తి స్థాయిలో ఇండ్ల నిర్మాణం పూర్తి కావని హెచ్ఎండీఏ కమిషనర్‌గా పని చేసిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడడం గమనార్హం.

40 ఏండ్ల క్రితమే ప్లాట్లు

రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలుగా పంచాయతీ అనుమతులతో లేఅవుట్లు చేసి దందా చేశారు. నగర శివారు ప్రాంతాలు కావడంతో పెట్టుబడి రూపంలో ఎంతో మంది ఆ ప్లాట్లు కొనుగోలు చేశారు. వాళ్ల దగ్గర సేల్ డీడ్లు, లే అవుట్ కాపీలు ఉన్నాయి. కొన్ని ప్లాట్లు పది మంది వరకు చేతులు మారాయి. అంటే ఆ ప్లాటు ధర కంటే వాళ్లు చెల్లించిన స్టాంపు డ్యూటీ అధికం. అయితే చాలా వరకు లే అవుట్లకు సంబంధించిన భూ రికార్డులను మార్చలేదు. నేటికీ పట్టా భూములుగా, పట్టాదారుడి పేరుతోనే ఉన్నాయి. 2017 భూరికార్డుల ప్రక్షాళనలోనూ వీటిని ప్లాట్లుగా మార్చకుండా పట్టాదారులకు కొత్త పాసు పుస్తకాలు జారీ చేశారు. దాంతో రైతుబంధు కింద రూ.లక్షలు పొందుతున్న వారున్నారు. దాదాపు 8 లక్షల ఎకరాల దాకా రికార్డులకు ఎక్కనివి ఉన్నట్లు ఓ సందర్భంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేవలం నాలా కన్వర్షన్ ఫీజు చెల్లించని కారణంగా వ్యవసాయ భూములుగా రాశారు. కొన్ని ప్రాంతాల్లో నాలా కన్వర్షన్ చేసిన భూములకు సైతం పాసు పుస్తకాలు జారీ అయిన ఉదంతాలు ఉన్నాయి. ‘ధరణి’లో నేచర్ ఆఫ్ ల్యాండ్ కాలమ్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే నమోదు చేసిన కారణంగా లక్షలాది సేల్ డీడ్లకు విలువ లేకుండా చేశారు. ప్లాట్లు, సాగు భూముల లావాదేవీలన్నీ ఒక్క చోట ఉన్నప్పుడే ఇలాంటి అక్రమాలు అనేకం చోటు చేసుకున్నాయి. మరి ఇప్పుడు వేర్వేరుగా చేపట్టే రిజిస్ట్రేషన్ల దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది.

రైతు భరోసా.. బంద్

ఆబాదీ విస్తరణతో వ్యవసాయేతర భూములకు సంక్షేమ పథకాలు తీసుకునే అక్రమార్కులకు చెక్ పడుతుంది. కొన్ని లక్షల ఎకరాల భూమి లేఅవుట్లుగా మారింది. అంటే ఆబాదీగా మారినా రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే పేర్కొని పాసు పుస్తకాలు జారీ చేశారు. దాంతో రూ.వేల కోట్లు రైతుబంధు పథకం కింద అందుకుంటున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి దోపిడీకి చెక్ పడనున్నది. ఒకే శాఖలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు ఉండడం ద్వారా లబ్దిదారుల ఎంపికలోనే జాగ్రత్తలు తీసుకుంటే నిధుల దుర్వినియోగాన్ని ముందుగానే నియంత్రించే వీలవుతుంది. ఇప్పటికే రైతు భరోసా పథకానికి అర్హులను గుర్తించే ప్రక్రియ వ్యవసాయ శాఖ చేపట్టింది. ఈ క్రమంలో ప్లాట్లుగా మారిన భూములను గుర్తిస్తే ప్రభుత్వానికి ఎంతో మేలు కలుగుతుంది.

మళ్లీ మళ్లీ అమ్మకాలు

ప్రస్తుత ఆబాదీని విస్తరించేందుకు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ తదితర జిల్లాల్లో 40 ఏండ్ల క్రితం లేఅవుట్లు చేసి విక్రయించారు. వాటినే మళ్లీ సాగు భూములుగా విక్రయించినట్లు ఆధారాలు ఉన్నాయి. పట్టాదారులు చనిపోయిన తర్వాత ఆయన వారసులు పాసు పుస్తకాలు సంపాదించి మరోసారి భూములను విక్రయించారు. ఇప్పుడు అదే భూమికి హెచ్‌ఎండీఏ అనుమతులు ఇవ్వడం గమనార్హం. నాలా కన్వర్షన్ చేయకపోయినా ఆ లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. దాంతో లక్షలాది సేల్ డీడ్లు హక్కుదార్ల దగ్గర ఉన్నాయి. 30, 40 ఏండ్ల క్రితం నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు చేసి అమ్మేసిన భూములకు భూ రికార్డుల ప్రక్షాళన పేరిట తిరిగి వ్యవసాయ భూములుగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు.

క్షేత్ర స్థాయి పరిశీలన అవసరం

పహాణీ, రైతు పాసుపుస్తకం/టైటిల్‌డీడ్‌.. కొన్నవారెవరూ మ్యుటేషన్‌ చేయించుకోని ఏకైక పొరపాటు నిండా ముంచేస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒకటే భూమి వ్యవసాయ భూమిగా, ప్లాట్లుగా ఏకకాలంగా సమాంతరంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్లలో ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా రికార్డులు కనిపిస్తుంటాయి. కానీ వాటినే సాగుభూములుగా మరోసారి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. పాసు పుస్తకాల ఆధారంగా సాగుభూములు, సేల్‌డీడ్‌/లింక్‌ డాక్యుమెంట్ల ఆధారంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొనసాగించారు. అలాగే రెవెన్యూ అధికారుల తీరు అంతే.. కళ్ల ముందే లే అవుట్లు కనిపిస్తాయి. ప్లాట్లు అంటూ పాతిన హద్దురాళ్లు దర్శనమిస్తాయి. కానీ పహాణీ రికార్డుల్లో మాత్రం దశాబ్దాలుగా సాగుభూములుగానే కొనసాగిస్తున్నారు.. హైదరాబాద్‌ చుట్టూ ఎటూ 50 కి.మీ. దూరంలో వేల లేఅవుట్లు ఉన్నాయి. పహాణీల్లో వాటిని మాత్రం నేటికీ సాగు భూములుగా పేర్కొంటున్నారు.

రూ.వందల కోట్ల నష్టం

రైతుబంధు నిధులు దుర్వినియోగం అవుతుందన్న అంశం ఎంత వరకు నిజమని ఎవరైనా అడిగితే.. అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు, భవనాల లెక్కను చూపిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం అందిన దరఖాస్తుల సంఖ్య 25 లక్షలకు పైనే. ఒక్క ప్లాటు సగటున 150 గజాలుగా అనుకుంటే మొత్తం విస్తీర్ణం 37,50,00,000 చ.గజాలు(77,480 ఎకరాలు). ఇందులో నాలా కన్వర్షన్ చేయని భూమి 75 శాతానికి పైగానే. ఇక అప్లయ్ చేయని ప్లాట్ల విస్తీర్ణం సైతం అదే స్థాయిలో ఉంటుంది. ఈ మొత్తం ల్యాండ్‌కు రైతుబంధు ఇస్తున్నారు.

‘ఎక్స్ టెండెడ్ ఆబాదీ’ రికార్డు చేయాలి: ఎం.సునీల్ కుమార్, భూ భారతి రూపకర్త

ఆబాదీ ఎన్నో ఏండ్ల క్రితం గుర్తించింది. నిజానికి ప్రతి ఊరూ విస్తరించింది. ఎన్నో లే అవుట్లు వేశారు. వీటన్నింటినీ ఎక్స్ టెండెడ్ ఆబాదీగా రికార్డు రాయడానికి అవకాశం ఉంటుంది. అయితే నాలా కన్వర్షన్ చేయకుండా రాయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. భూ భారతిలో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్, ఆబాదీ.. ఇలా మూడు రకాల రికార్డులు ఉంటాయి. ఆబాది అంటే సర్వే నంబరు లేకుండా ఉంటుంది. అయితే పెరిగిన ఇంటి స్థలాలను కూడా రికార్డు చేయడానికి రూల్స్ ఫ్రేం చేయాలి. ల్యాండ్‌కి రెవెన్యూ కస్టోడియన్, ట్యాక్స్ కలెక్షన్, ఇంటి అనుమతులు వంటివి స్థానిక సంస్థలకు సంబంధించినవి. ఇదంతా ప్రిస్క్రైబ్డ్ డేట్ నుంచే జరుగుతుంది. రూల్స్‌లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.


Similar News