మైనింగ్ మాఫియాకు దళితుల భూములు: Congress

బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల భూములను మైనింగ్ మాఫియాకు అప్పగిస్తుందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు..

Update: 2023-09-29 16:58 GMT
  • కేసీఆర్ ప్రభుత్వంలో దుర్మార్గం
  • అక్రమ మైనింగ్ తో 56 మంది మృతి
  • ఇబ్రహీంపట్నం లో 412 రోజులుగా గ్రామస్తులు దీక్షలు
  • ఫిర్యాదు చేసినా ఆఫీసర్లు పట్టించుకోవట్లే
  • - కాంగ్రెస్ నేత బక్క జడ్సన్

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల భూములను మైనింగ్ మాఫియాకు అప్పగిస్తుందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. కాంగ్రెస్ హాయంలో ఇచ్చిన అసైన్డ్ భూములన్నింటినీ ఈ ప్రభుత్వం వెనక్కి గుంజుకుంటున్నదన్నారు. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మండలంలో బండ రవిలాల, చిన్న రావిలాల‌లో వెయ్యి ఎకరాలలో అక్రమ మైనింగ్‌ను ఆపాలని 412 రోజులుగా గ్రామస్తులు నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ తరపున ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కమిషన్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూ నోటీసులు అందాయన్నారు. మంత్రి కేటీఆర్ అండదండలతోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ అక్రమ మైనింగ్ వల్ల 56 మంది పేదలు చనిపోయారని, డైలీ 3 వేల లారీలలో అక్రమ మైనింగ్ జరుగుతుందన్నారు.

కిసాన్ కాంగ్రెస్ కోదండరెడ్డి మాట్లాడుతూ..నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ విషయంలో నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదన్నారు. బ్లాస్టింగ్ వల్ల రైతులు చాలా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో ఒక మాఫియా పని చేస్తుందన్నారు.


Similar News