దేశానికి వెన్నెముక యువత.. డాక్టర్ చిన్మయి తమ్మారెడ్డి
మత్తు పదార్థాలను బహిష్కరించి మత్తురహిత సమాజాన్ని నిర్మించాలని ప్రముఖ వైద్య నిపునురాలు, ఉస్మానియా ఆస్పత్రి జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభా లక్ష్మీ అన్నారు.
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : మత్తు పదార్థాలను బహిష్కరించి మత్తురహిత సమాజాన్ని నిర్మించాలని ప్రముఖ వైద్య నిపునురాలు, ఉస్మానియా ఆస్పత్రి జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభా లక్ష్మీ అన్నారు. సోమవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ (టీసీసీ) రాష్ట్ర శాఖ, సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులకు, యువకులకు, అధ్యాపకులకు మాదకద్రవ్యాల వాడడం వల్ల వచ్చే అనర్ధాలు నియంత్రణ అంశం పై ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో అందమైనదని మాదక ద్రవ్యాలకు బానిసలై అలాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు. గంజాయి, కోకైన్, హెరాయిన్ లో ఉండే టీహెచ్సీ అనే రసాయనం వ్యక్తులను దానికి బానిసలుగా మార్చి అది మెదడు పై తీవ్రప్రభావం చూపిస్తుందని, ఇది శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి దెబ్బతీస్తుంది అన్నారు. డ్రగ్స్, మద్యం మత్తులో తీవ్రమైన నేరాలకు యువత పాల్పడుతున్నారని ఒక సర్వే ప్రకారం దేశీయంగా ప్రతి ఆరుగురిలో ఒకరు మద్యానికి బానిస అవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రముఖ మానసిక నిపుణురాలు, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ చిన్మయి తమ్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో మాదకద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిన మించాయని, దేశానికి వెన్నెముక లాంటి యువత మాదక ద్రవ్యాల సేవనంతో పతనమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ ఆంటోనీ సంగయరాజా ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి ఎంతో కీలకమైన యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ సేవించే వారిని మానసిక రుగ్మతలు ఉన్న రోగులుగా భావించి వారు బయటపడేందుకు కృషి చేయాలని అన్నారు.
తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ టెల్లా ఏ మురళీ మోహన్ మాట్లాడుతూ డ్రగ్స్ మద్యం మత్తులో తీవ్రమైన నేరాలకు యువత పాల్పడుతున్నారని, ఒక సర్వేప్రకారం దేశీయంగా ప్రతి ఆరుగురిలో ఒకరు మద్యానికి బానిస అవుతున్నారని, సర్వే లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది డ్రగ్స్ కు అలవాటు పడ్డారని, కోటిన్నర మందికి పైగా నల్లమందు, కృత్రిమ నల్లమందును, మూడు లక్షల మంది కుకీన్ కు బానిస అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీఓ అపర్ణ రాజ్ హన్స్ , ప్రముఖ యోగ ట్రైనర్ టీసీసీ కోఆర్డినేటర్ ఎస్ ఆర్ కె శాస్త్రి, శివకుమార్, సీ.రాజేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.