మన్మోహన్.. గ్రేటెస్ట్ ఎకనామిస్ట్, లీడర్: సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు...

Update: 2024-12-27 02:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. పదేండ్లు దేశానికి ప్రధానిగా ఉన్న మన్మోహన్ గొప్ప ఎకనామిస్ట్, లీడర్, రిఫార్మర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పదేండల్ పాటు ప్రధానిగా దేశానికి సేవలందించి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ఇక లేరనే వార్త తనను బాధించిందని పేర్కొన్నారు. పొలిటికల్, పబ్లిక్ లైఫ్ లో నిబద్ధతతో వ్యవహరించారని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. దేశం గొప్ప లెజెండ్ ను కోల్పోయిందని పేర్కొన్నారు. మన్మోహన్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది : మాజీ సీఎం కేసీఆర్

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్లు మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడిగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు. పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దు బిడ్డగా కొనియాడారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భంగా కేసీఆర్ తెలిపారు. మన్మోహన్ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పనిచేసిన గతాన్ని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటుకు ఆయన అందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.

దేశానికి వన్నె తీసుకొచ్చారు : కిషన్ రెడ్డి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూజీసీ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశానికి వన్నెతీసుకొచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మన్మోహన్ కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారన్నారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థిక మంత్రిగా.. దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు. 2019లో తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆయన అప్పుడప్పుడూ వీల్ చైర్లో రావడాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అంకితభావానికి ఇది నిదర్శనమని కొనియాడారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మన్మోహన్ సేవలు మరువలేనివి : బండి

దేశానికి మన్మోహన్ సింగ్ అందించిన సేవలు మరువలేనివని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

దేశానికి తీరని లోటు : మహేష్ కుమార్ గౌడ్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావిగా ఆయన్ను కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు. నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పని చేయడంలాంటివి మన్మోహన్ సింగ్ ను చూసి నేర్చుకోవాలన్నారు.

ఇదిలా ఉండగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై రాష్ట్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహా, మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. దూరదృష్టి కలిగిన నాయకుడని, దేశ పురోగతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా మంత్రి సీతక్క కొనియాడారు. ఉపాధిహామీ, సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. గొప్ప ఆర్థిక సంస్కర్తను జాతి కోల్పోయిందని, నమ్మిన సిద్ధాంతాన్ని జీవితకాలం ఆచరించిన గొప్ప మనిషి మన్మోహన్ సింగ్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రపంచీకరణతో భారత్ ను తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత మన్మోహన్ సింగ్ దేనని, దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత ఆయనదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆయన కుటుంబానికి ఆశ్రు నివాళి అంటూ పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి సమస్య లేకుండా నడిపిన సమర్థ నాయకుడు మన్మోహన్ సింగ్ అని మంత్రి కొండా సురేఖ గుర్తుచేసుకున్నారు. మన్మోహన్ సింగ్ పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో ఆర్ధికశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలను అమలుచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడవడానికి పునాదులు వేశారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అధునాతన భారత నిర్మాణానికి సైలెంట్ ఆర్కిటెక్ట్ మన్మోహన్ సింగ్ అంటూ అభివర్ణించారు. విజనరీ కలిగిన నాయకుడని పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ మన్మోహన్ మృతిపై సంతాపం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News