దళితులను అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రానిదే : బీవీ రాఘవులు
దళితుల అభివృద్ధి బాధ్యత కేంద్రానిదే అని, కుల అణిచివేతను సమర్ధించే విధానం బీజేపీదేనని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ ( డీఎస్ఎంఎం ) జాతీయ నాయకులు బీవీ రాఘవులు అన్నారు.
దిశ, ముషీరాబాద్ : దళితుల అభివృద్ధి బాధ్యత కేంద్రానిదే అని, కుల అణిచివేతను సమర్ధించే విధానం బీజేపీదేనని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ ( డీఎస్ఎంఎం ) జాతీయ నాయకులు బీవీ రాఘవులు అన్నారు. దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్... దళితుల సాధికారిత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాఘవులు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కుల వ్యవస్థ గుండెగా సనాతన ధర్మం ముసుగులో మనుస్మృతి ద్వారా దళితులను అన్ని రంగాల్లో అణిచివేతకు గురి చేస్తున్న కేంద్ర సర్కార్ బడ్జెట్‌లో వారికి జనాభా దమాషా ప్రకారం నిధులు కేటాయించకుండా వివక్ష వహించిందని ఆరోపించారు. గతంలో కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా అన్యాయం చేసిందన్నారు.
శ్రమ గౌరవం అనే పేరుతో కుల వృత్తులను గౌరవించాలని అంటున్న నేతలు పాకిపని, పౌరోహిత్యం చేయడాన్ని ఒకే విధంగా ఎందుకు చూడటం లేదన్నారు. దళితుల అణిచివేతకు హిందూ ధర్మం కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తులకి, ఆదాని వంటి బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సబ్సిడీలు రద్దు చేసిందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే విధంగా బడ్జెట్లో గత రెండేళ్లలో సగానికి పైగా తగ్గించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బుద్ధవనం ప్రాజెక్టు డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా ఉన్నప్పటికీ అవి ఖర్చు చేయడంలో విఫలమవుతుందన్నారు. కేటాయింపులు ఖర్చుకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం సరైనది కాదన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ బడ్జెట్ అంటే బాధితులకు దీపం కావాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితల అభివృద్ధి కుంటు పడటమే కాకుండా మధ్య యుగాల కాలం నాటి మనుధర్మ దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.శివలింగం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకులు పి.ఆశయ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మానాయక్, బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కడమంచి రాంబాబు, ఆవాజ్ రాష్ట్ర నాయకులు ఎండి.సర్దార్, ఆడజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి, డీబీఎఫ్ నాయకులు కల్పన, రఘుపతి, కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొట్ల శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పల్లెర్ల లలిత, రాష్ట్ర కమిటీ సభ్యులు కృపాసాగర్, ఎన్.బాల పీరు, హైదరాబాద్ జిల్లా నాయకులు ఎం.దశరథ్, టి.సుబ్బారావు, బాలయ్య, నరసింహ పాల్గొన్నారు.