కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ…కేసులు నమోదు
పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం కాస్త పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
దిశ, ఖైరతాబాద్ : పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం కాస్త పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన చాంద్ షేక్ లైట్ అండ్ షాడో స్టూడియో పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. అతడు ఒక విదేశీ కుక్క పిల్లను పెంచుకుంటున్నాడు. పక్క ఫ్లాట్ లో నివసించే రుచిత అగర్వాల్ వద్దకు ఆ కుక్క పిల్ల తరచూ వెళ్తుంది. దీంతో అప్పుడప్పుడు ఊరు వెళ్లే సమయంలో చాంద్ షేక్ ఈ కుక్కను రుచిక అగర్వాలకు అప్పగించేవాడు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు చాంద్ షేక్ విదేశాలకు వెళ్లాడు. తన పెంపుడు కుక్కను చూసుకోవాలని కోరుతూ రుచిత అగర్వాల్ కు అప్పగించి వెళ్లాడు.
ఈనెల 15న చాంద్ షేక్ తండ్రి షేక్ సుభాని కుక్క పిల్లను పక్కింట్లో నుంచి తెచ్చుకున్నాడు. దీంతో రుచికా కుక్క పై ఉన్న ప్రేమ, కోపంతో సుభానితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రుచికతో పాటు ఆమె సోదరుడు, ఆమె ఆఫీసులో పనిచేసే వికాస్, జేమ్స్ తదితరులు వచ్చి చాంద్ షేక్ స్టూడియో పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన సుభాని పై దాడికి దిగారు. విదేశాల నుంచి వచ్చిన చాంద్ షేక్.. రుచికా అగర్వాల్, ఆమె బంధువులు వచ్చి తన స్టూడియో ధ్వంసం చేసి రూ.25 లక్షల మేరకు నష్టం కలిగించడంతో పాటు తన తండ్రిపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను సుభానీ తీవ్ర పదజాలంతో దూషించాడంటూ రుచిత అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు.