మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో బిగ్ ట్విస్ట్...
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను చంపడానికి కుట్ర పన్నారని మూడేండ్ల కిందట 8 మంది పై నమోదైన కేసులో సంచలనం రేపే అంశం వెలుగులోకి వచ్చింది.
దిశ, సిటీ క్రైమ్ : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను చంపడానికి కుట్ర పన్నారని మూడేండ్ల కిందట 8 మంది పై నమోదైన కేసులో సంచలనం రేపే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పై ఫిబ్రవరి 25, 2022 సైబరాబాద్ పోలీసుల కమిషనరేట్ పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో కేసును నమోదు చేసి హత్యాయత్నం, కుట్ర, మారణాయుధాల చట్టం కింద అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయడానికి పన్నిన కుట్ర, హత్యాయత్నానికి సంబంధించిన ఆధారాలు ఏమి లభించలేదని అందుకే ఐదుగురు నిందితుల పై ఈ అభియోగాలు సరిపోవని పోలీసులు మేడ్చల్ క్రిమినల్ కోర్టులో ఇటీవల దాఖలు చేసిన చార్జీషీటులో పేర్కొన్నారు. మరో ముగ్గురి పై మారణాయుధాల అభియోగం మాత్రమే ఉందని పోలీసులు చార్జీషీటులో వివరించారు.
ఈ కేసులో చలువాగలి రాఘవేంద్రరాజు, సి. నాగరాజు, విశ్వనాధ్ రావు, వి.యాదయ్య, మున్నూరు రవి, సి.మధుసూదన్ రాజు, సి.అమరేందర్ రాజు, తిలక్ తాపాలను నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఒక పిస్టల్, రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేసిన పోలీసులు తిలక్, అమరేంద్ర, మధుసుదన్, విశ్వనాధ్, యాదయ్యల పై ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన విధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను చంపడానికి కుట్ర పన్నారనే ఫిర్యాదులో వీరందరి పాత్ర ఉందని హత్యాయత్నం, కుట్రకు సంబంధించిన సెక్షన్ లపై ఆధారాలు లభించకపోవడంతో ఈ ఐదుగురు పై ఆ సెక్షన్ లను పోలీసులు విరమించుకున్నట్లు దాఖలైన చార్జీషీటులో పోలీసులు పేర్కొన్నారు. మారణాయుధాల చట్టం సెక్షన్ కింద రాఘవేంద్ర రాజు, మున్నూర్ రవి, నాగరాజుల పై మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ పై నమోదైన కేసులో విచారణ జరగనుంది.
ఈ హత్యకు రూ.16 కోట్ల సుపారీ..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ ను హతమార్చేందుకు రాఘవేంద్ర రాజు, మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఫారూక్ ను కలిశాడన్నారు. తనను మంత్రి చాలా వేధిస్తున్నాడని, అందుకే మంత్రి అడ్డును తొలగించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పి ప్లాన్ అమలు చేసి పెడితే 16 కోట్ల రూపాయలు ఇస్తానని రాజు ఆఫర్ ఇచ్చినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ కేసులో ఫారూక్ ఫిర్యాదు చేయడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందిన తర్వాత సైబరాబాద్ పోలీసులు పూర్తి ఆధారాలు, సీసీ కెమెరాల ద్రుశ్యాలు ఇంకా అనేక సాంకేతిక ఆధారాలను సేకరించిన తర్వాతనే కేసును నమోదు చేసి 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు తెలిపారు. ఈ కేసులోని ప్రధాన నిందితులు రాఘవేంద్ర రాజు, మున్నూర్ రవి, మధుసుదన్ రాజులు పరారయ్యి ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం తలదాచుకున్న విషయం తెలుసుకుని ప్రత్యేక టీంను ఢిల్లీ పంపించి అరెస్టు చేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ జితేందర్ రెడ్డి పీఏ, డ్రైవర్ లు కూడా ఈ హత్య కుట్రలో భాగమని పోలీసులు తెలిపారు.
ఆధారాలు లేవు..
గతంలో సెన్సేషనల్ గా మారిన ఈ కేసులో అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని స్వయంగా కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు ఇప్పుడు ఆ కుట్రకు, హత్యాయత్నానికి సంబంధించిన అభియోగాలకు నో ఎవిడెన్స్ అంటూ చార్జిషీటు దాఖలు చేయడంతో మరోసారి ఈ కేసు సంచలనంగా మారింది. అంటే అధికారం బలం, రాజీకీయ వత్తిళ్ళ కారణంగానే అప్పటి సైబరాబాద్ పోలీసులు ఈ విధంగా కేసు నమోదు చేశారని తెలుస్తోంది. సీపీ స్థాయిలో ఉన్న స్టీఫెన్ రవీంద్ర కూడా ఈ హత్య కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే నిందితులను అరెస్టు చేశామని, బహిరంగంగా మీడియా సమావేశంలోనే చెప్పడం, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని, దర్యాప్తు పారదర్శకంగా ఉంటుందని చెప్పడం గమనార్హం.